ACB: వీడీ వెంకటరెడ్డి చుట్టూ బిగుస్తున్న ఏసీబీ ఉచ్చు

విచారణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు... వెంకటరెడ్డిని విచారణ చేసేందుకు అనుమతి

Aug 26, 2024 - 09:55
Aug 26, 2024 - 09:59
 0  1
ACB:  వీడీ వెంకటరెడ్డి చుట్టూ బిగుస్తున్న ఏసీబీ ఉచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచుతోంది. ఆంధ్రప్రదేశ్‌ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. వెంకట రెడ్డి ఆచూకీ కోసం మాతృశాఖ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థకు ప్రభుత్వం లేఖ కూడా రాసింది.. తమకు వెంకట రెడ్డి ఆచూకీ తెలియదని ప్రభుత్వానికి కోస్ట్ గార్డ్ సంస్థ సమాధానం ఇచ్చింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో వైసీపీ పెద్దల ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి, అన్నీ తానై వ్యవహరించారనే ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గనులశాఖ పూర్వ ఎండీ వీజీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ కింద అనుమతి తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు, టెండర్లు, ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.

నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా ప్రైవేటు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించారన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1న ఆయన్ను సస్పెండ్‌ చేసిన ఏపీ ప్రభుత్వం, ఆ అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏ ప్రభుత్వ ఉద్యోగిపైనైనా విచారణ జరపాలంటే సంబంధిత దర్యాప్తు సంస్థ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఈ సెక్షన్‌ కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి పొందారు. ప్రాథమిక విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. వీజీ వెంకటరెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నందున పదవీ విరమణ చేయడం సాధ్యం కాదు. గనుల లీజుల కేటాయింపు, ఇసుక టెండర్ల ఖరారు, ఒప్పందాల్లో వెంకటరెడ్డి పలు నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. వాటికి సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తోంది. ఇసుక గుత్తేదారు సంస్థ జేపీ పవర్‌ వెంచర్స్‌ ప్రభుత్వానికి రూ.800 కోట్లు బకాయి ఉన్నప్పటికీ ఆ సంస్థకు ఎన్‌వోసీ ఎలా జారీ చేశారు? ఎవరి ఆదేశాల మేరకు చేశారనే వివరాలు సేకరిస్తోంది. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థల ఉల్లంఘనల్లో వెంకటరెడ్డి ప్రమేయంతో పాటు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీల్లో తప్పుడు సమాచారంతో కూడిన అఫిడవిట్ల సమర్పణ తదితర అంశాలపై ఏసీబీ ప్రాథమిక విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించింది. వెంకటరెడ్డి గత రెండు నెలలుగా పరారీలోనే ఉన్నారు. సస్పెన్షన్‌ నోటీసులు అందజేయడానికి గనుల అధికారులు వెళ్లినా సరే ఆయన నివసించే చిరునామాల్లో ఎక్కడా అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో ఆయన కదలికలపై కూడా ఏసీబీ గురిపెట్టింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News