AP: అచ్యుతాపురం ప్రమాదంపై మంత్రుల ఆవేదన
భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్న పవన్... ఇప్పటికే కంపెనీపై కేసు పెట్టామన్న కొల్లు రవీంద్ర
అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖ కిందికి వస్తుందని చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పామని పవన్ గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని పవన్ వెల్లడించారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమని చెప్పారు. సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు.
దిగ్భ్రాంతి కలిగించిందన్న కొల్లు రవీంద్ర
అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 17 మంది మృతిచెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు. కంపెనీ నుంచి బాధితులకు పరిహారం ఇప్పిస్తామని వివరించారు. ప్రభుత్వం తరఫున కూడా సహకారం అందిస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. చివరి బాధితుడి వరకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. సీఎం చంద్రబాబు నేడు బాధితులను పరామర్శిస్తారని కొల్లు రవీంద్ర తెలిపారు.
మూడు ఆసుపత్రుల్లో చికిత్స
అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో 18 మందికి చికిత్స అందిస్తున్నారు. అచ్యుతాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో 10 మందికి, విశాఖపట్నంలోని మెడికవర్‌లో ఏడుగురికి చికిత్స కొనసాగిస్తున్నారు. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పరామర్శించారు. బాధితులకు అందుతున్న చికిత్సపై వైద్యులతో మాట్లాడారు. మరోవైపు 17 మృతదేహాలను విశాఖ కేజీహెచ్, అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 12 కేజీహెచ్‌కు, 5 అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన ట్రైనీ ఇంజినీర్ హారిక చెల్లపల్లి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేశారు.
What's Your Reaction?