AP; తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక నగరాలు!
అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం..!... వచ్చే కేబినేట్ సమావేశాల్లో ఆమోద ముద్ర
తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో రూ.25 వేల కోట్లతో పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే కేబినెట్ సమావేశంలో అందుకు ఆమోదముద్ర వేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ పారిశ్రామిక నగరాల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడానికి వీలున్నట్లు అంచనా. ఇవి సాకారమైతే ఆయా రాష్ట్రాల పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక వృద్ధికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ పారిశ్రామిక నగరాలను నివాస, వాణిజ్య మండళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చేయాలని భావిస్తున్న జాబితాలో తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్‌నోయిడా, గుజరాత్‌లోని ధొలేరా పారిశ్రామిక నగరాల తరహాలో వీటిని అభివృద్ధి చేస్తారని, వాటిలో జౌళి, ఫ్యాబ్రికేషన్, విద్యుత్తు వాహనాలు, విమానయాన విభాగాలు, ఆహారశుద్ధి, పర్యాటక రంగాలకు సంబంధించిన పార్క్‌ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారని అంచనా వేస్తున్నారు.
ఏపీలో పెట్టుబడులకు ఒబెరాయ్ ఆసక్తి
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ సంస్థ ఆసక్తి చూపుతోందని.. సెప్టెంబరు 20లోగా విశాఖపట్నం సమీప భోగాపురం వద్ద అన్నవరంలో హోటల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గండిపేట, విశాఖపట్నం, తిరుపతిల్లో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదించినా.. అడుగులు పడలేదని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబుతోపాటు తనతో పలుదఫాల చర్చల అనంతరం పనులు ప్రారంభించేందుకు ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. హార్సిలీహిల్స్ , పిచ్చుకల్లంకలోనూ పీపీపీ విధానంలో హోటళ్లు నిర్మించాలని గతంలో కోరగా, క్షేత్ర పరిశీలనకు ఇప్పటికే రాజమహేంద్రవరం వచ్చారన్నారు. స్థానికంగా ఉన్న పర్యాటక అవకాశాలు, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టుల గురించి తెలుసుకొని సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. రాజమహేంద్రవరంలో గత ప్రభుత్వ హయాంలో రూ. 250 కోట్లతో ప్రణాళికలు రూపొందించారని.. క్షేత్ర పరిశీలన తరువాత మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి చూపారని చెప్పారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్‌లో ఒబెరాయ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.శంకర్, ప్రతినిధులు నవీన్‌గోస్వామి, మాలూన్ తానేజ్‌లతో మంత్రి దుర్గేశ్, పర్యాటక శాఖ ఆర్జేడీ స్వామినాయుడు సమావేశమయ్యారు.
What's Your Reaction?