AP: వైరల్ జ్వరాలతో... ఏపీ విలవిల
విజయవాడ, విశాఖ సహా ప్రధాన నగరాల్లో భారీగా జ్వర బాధితులు...ఆస్పత్రులు కిటకిట
ఏపీలో వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, తిరుపతి సహా చిన్న, పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు జ్వర బాధితులతో నిండిపోయాయి. వర్షాకాలానికి తోడు పారిశుద్ధ్య లోపం వల్ల నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. నీరు, గాలి కాలుష్యం తోడై జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్ల నొప్పులతో బాధపడేవారూ ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసిన వారిలో జ్వరపీడితులు ఎక్కువగా ఉంటున్నారు. మలేరియా, డెంగీ కేసులు అనధికారికంగా మరింత ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లల్లో ఎడినో, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జ్వరాలను ఎక్కువగా గుర్తిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలూ కనిపిస్తున్నాయి. జ్వరపీడితులు ఇంట్లో ఇద్దరుంటే చికిత్స కోసం కనీసం రూ.10 వేల వరకు ఖర్చవుతోంది. రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, కుక్కునూరు మండలాల్లో, కృష్ణా జిల్లా ఉయ్యూరు, ప్రకాశం జిల్లా కనిగిరి, దర్శి నియోజకవర్గాల పరిధిలోనూ విషజ్వరాల బెడద ఎక్కువగా ఉంది. పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో రోజూ 550 వరకు ఓపీ నమోదవుతోంది.
గిరిజన ప్రాంతాల్లోనే... మలేరియా కేసులురెండేళ్లతో పోల్చితే మలేరియా, గన్యా కేసులు పెరగ్గా డెంగీ కేసులు తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు 4,610 మలేరియా కేసులు నమోదయినట్టు ప్రభుత్వం చెబుతోంది. గిరిజన ఆవాస ప్రాంతాలున్న జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మన్యం జిల్లాలో జ్వరాల బెడద మరీ ఎక్కువగా ఉంది. జియ్యమ్మవలస మండలం చిత్రపాడు పంచాయతీ పరిధిలో తీవ్ర జ్వరంతో ఉదయం తల్లి, సాయంత్రం కుమార్తె ఇటీవల మరణించారు.
తగ్గుముఖం పట్టిన డెంగీ
రెండేళ్లతో పోల్చితే గన్యా కేసులు రాష్ట్రంలో పెరిగాయి. గడిచిన రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది డెంగీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 2,955 కేసులు రికార్డయ్యాయి. వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి, కండరాలు కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడం వంటి లక్షణాలు డెంగీ, మలేరియా జ్వరాల బారినపడిన వారిలో కనిపిస్తున్నాయి. వ్యక్తిగత శుభ్రత తప్పనిసరి. అనర్హుల వద్ద వైద్యం ప్రాణాంతకం. వారు ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఇస్తూ రోగులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తారు. అర్హులైన వైద్యులు రోగి శరీర బరువు, ఇతర లక్షణాలనుబట్టి చికిత్సనందిస్తారని వైద్యులు తెలుపుతున్నారు.
What's Your Reaction?