AP: ఆంధ్రప్రదేశ్ యువతకు సువర్ణావకాశం
యువత కోసం ఏపీ ప్రభుత్వం ఈడీపీ కార్యక్రమం... ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. యువత కోసం సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. ఏపీలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనుకునే యువతకు చేయూత ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి వారి కోసం ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం EDP అనే కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రణాళిక రచిస్తోంది. బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థతో ఆయాశాఖల అధికారులు చర్చలు కూడా ప్రారంభించారు. అక్కడ నేర్పించే పరిశ్రమల సిలబస్‌కు అనుగుణంగా 4 లేదా 6 వారాలు శిక్షణ అందిస్తారు. ఈ మేరకు ఒక్కో అభ్యర్థిపై అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి భరించనుంది. అంతేకాదు ఏటా 2వేల మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఈ ఈడీపీ కార్యక్రమంలోకి 1,000 మంది బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 500 మంది, కాపు సామాజిక వర్గం నుంచి 500 మందిని తీసుకోనున్నారు. ఏపీలో ఆయా వర్గాల నుంచి బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణను అందిస్తారు. ఈ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ శిక్షణకు ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ఓ విధానం, ప్రశ్నావళిని కూడా తీసుకొస్తున్నారు. మొత్తంగా ఐదేళ్లలో 9 వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా ప్రణాళికల్ని సిద్ధం చేశారు. ఎన్‌ఐఎంఎస్‌ఎంఈలో శిక్షణ తర్వాత వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న యువత.. తమకు వచ్చే ఆలోచనలను సదరు సంస్థతో నిరంతరం పంచుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. యువతకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి.
వైసీపీ నేతకు ఏపీ మంత్రి ఫోన్
ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ నేత, తన రాజకీయ ప్రత్యర్థిని పరామర్శించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ పేరాడ్ తిలక్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలియగానే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తిలక్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.. గాయం నుంచి కోలుకునేంతవరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
What's Your Reaction?