AP CM Chandrababu: గుడ్లవల్లేరు ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
AP CM Chandrababu: గుడ్లవల్లేరు ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినుల హాస్టల్ వాష్‌రూంలలో కెమెరాలు బిగించారని జరిగిన ప్రచారం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందించి... విచారణకు ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ.. విచారణకు ఆదేశించారు. దీంతో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ అక్కడికి చేరుకుని, విద్యార్థినులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఒక మహిళా సీఐ ఆధ్వర్యంలో సాంకేతిక బృందాన్ని నియమించి విచారణకు ఆదేశించారు. విద్యార్థినుల ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ పద్మావతిపై చర్యలకు ఆదేశించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమక్షంలోనే అధికారులు హాస్టల్ మొత్తం తనిఖీ చేశారని.. అక్కడ ఎలాంటి కెమెరాలు లభించలేదని వెల్లడించారు. అయినప్పటికీ దర్యాప్తును కొనసాగిస్తూ సమగ్రంగా విచారణ కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇటువంటి ప్రచారాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా, ధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. తప్పుచేసిన వారిని ఉపేక్షించబోమని, మహిళలు, ఆడబిడ్డల భద్రతకు ఎన్డీయే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని మరోసారి స్పష్టం చేశారు.గుడ్లవల్లేరు కళాశాల సంఘటన గురించి ఉదయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉదయంనుంచి అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆందోళన, ఆవేదనను పరిగణనలోకి తీసుకుని పకడ్బందీగా దర్యాప్తు చేయాలని, నిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశించారు. విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ చేయాలని పేర్కొన్నారు.
కళాశాల యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థినుల వద్ద ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని కోరారు. ఆడబిడ్డల పట్ల తప్పుగా ప్రవర్తించారని తేలితే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. సంఘటనపై మూడు గంటలకోసారి తనకు నివేదించాలని అధికారులను ఆదేశించారు.
What's Your Reaction?