AP: అచ్యుతాపురం పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం
అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందడంపై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు చెప్పారు. అచ్యుతాపురం పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతిచెందిన వారికి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు పీఎంవో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని, పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
ఆ మిశ్రమం లీకవ్వడం వల్లే భారీ పేలుడు
అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సాల్వెంట్ లీకవడం వల్లే ప్రమాదం జరిగిందని ఫ్యాక్టరీస్ విభాగం డైరెక్టర్ చంద్రశేఖరవర్మ తెలిపారు. మిథైల్ టెర్ట్- బ్యుటైల్ ఈథర్ మిశ్రమాన్ని స్టోరేజీ ట్యాంకులోకి మార్చే సమయంలో ఆ మిశ్రమం లీకైందన్నారు. ఈ మిశ్రమం బయటకు వచ్చి వాతావరణ రసాయన చర్యల వల్ల ఆవిరిగా మారి పేలుడు సంభవించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. బాధితులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలు తెలుసుకున్నారు. అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. ఇప్పటి వరకు 17 మంది చనిపోయారని అధికారులు వివరించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఏంటనే విషయంలో ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు అధికారులు వివరించారు.ప్లాంట్ నిర్వహణలో మానవ తప్పిదం, ప్లాంట్ నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వెల్లడించారు. ప్రమాదం అనంతరం ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సరిగా లేదని స్పష్టం చేశారు. ముందు బాధితుల ప్రాణాలు కాపాడడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
What's Your Reaction?