AP: ఇకపై ప్రజలకు అందుబాటులో ప్రతీ జీవో
ఏపీలో మళ్లీ అందుబాటులోకి జీఓఐఆర్ పోర్టల్... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం
గత వైసీపీ ప్రభుత్వం తన అరాచక చర్యలు, అడ్డగోలు నిర్ణయాలు, దోపిడీ గురించి ప్రజలకు తెలియకుండా మూసేసిన జీఓఐఆర్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి రానుంది. ఈ నెల 29 నుంచి కూటమి ప్రభుత్వం జారీచేసే ప్రతి జీఓనూ జీఓఐఆర్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనుంది. ప్రజలంతా వాటిని స్వేచ్ఛగా చూడొచ్చు, అభ్యంతరాలుంటే ప్రశ్నించవచ్చు. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. సమాచారహక్కు చట్టం అమల్లోకి వచ్చాక... ప్రతి జీఓనూ ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ రావడంతో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం జీఓఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వాలన్నీ దాన్ని కొనసాగించాయి. కానీ వైసీపీ ప్రభుత్వం జీఓల విషయంలోనూ దాచిపెట్టే ధోరణినే అనుసరించింది.
పోర్టల్ ఎత్తివేత..
వైసీసీ అధికారంలోకి వచ్చాక కొన్నాళ్లు జీఓఐఆర్‌ను కొనసాగించింది. కానీ ప్రభుత్వ అడ్డగోలు, అసంబద్ధ నిర్ణయాల గురించి ప్రజలకు తెలిసిపోవడం, వాటి వెనక వాస్తవాలపై మీడియాలో చర్చ జరగడం, సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోయడం, కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు రావడంతో గత సర్కారు ఉక్కిరిబిక్కిరైంది. దీంతో కొన్నాళ్లపాటు ఆన్‌లైన్‌లో జీఓల నంబర్లే పెట్టి, మిగతా అంతా ఖాళీగా ఉంచేసేది. కొంత ఆలస్యంగానైనా సమాచారం బయటకు వచ్చేది. ఇలా లాభం లేదనుకున్న ప్రభుత్వం ఏకంగా జీఓఐఆర్ పోర్టల్‌నే ఎత్తేసింది.
ఏడు శాతం మాత్రమే..
జీఓఐఆర్‌ను మూసేయడం సమాచారహక్కు చట్టానికి తూట్లు పొడవడమేనని, దాన్ని అందుబాటులోకి తేవాలని కొందరు కోర్టుకు వెళ్లారు. దాంతో ప్రభుత్వం 2021 సెప్టెంబరు 7న జీఓ నం.100 జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని టాప్ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రొటీన్ నేచర్... అని నాలుగు కేటగిరీలుగా విభజించి, రొటీన్ నేచర్ జీఓలనే ఏపీ ఇ-గెజిట్ పోర్టల్‌లో వారానికోసారి అప్‌లోడ్ చేస్తామని తెలిపింది. ఇలా 2021 ఆగస్టు 15 నుంచి వైసీపీ ప్రభుత్వం జారీచేసిన మొత్తం జీఓల్లో 7% మాత్రమే ఇ-గెజిట్‌లో అప్‌లోడ్ చేసింది.
కూటమి ప్రభుత్వంలో... అందుబాటులోకి
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక... మొత్తం జీఓలన్నీ ఇ-గెజిట్‌తో పాటు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో ఉన్న జీఓఐఆర్ పోర్టల్‌ను మళ్లీ ప్రారంభించి, మొత్తం జీఓలు అప్‌లోడ్ చేయడం ద్వారా పారదర్శక పాలనకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ ప్రభుత్వం జారీచేసే జీఓలతో పాటు... 2021 ఆగస్టు 15 నుంచి వైసీసీ ప్రభుత్వం జారీచేసిన మొత్తం జీఓలను జీఓఐఆర్‌లో అప్లోడ్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చాలా ఉత్తర్వుల్ని మెమోలు, యూవో నోట్‌ల రూపంలో ఇచ్చిందని, వాటినీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
What's Your Reaction?