AP: ఏపీలో నామినేటెడ్ పదవుల సందడి
ఎక్కువ పోస్టులు ఆశిస్తున్న బీజేపీ నేతలు... ఆశావహుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటేడ్ పదవుల హడావిడి ప్రారంభమైంది. నామినేటెడ్ పదవులపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగింది. నామినేటెడ్ పదవుల విషయంలో బీజేపీ కాస్త ఎక్కువ పోస్టులే ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన తమ కార్యకర్తల కోసం.. బీజేపీ ఎక్కువ పోస్టులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్ నేరుగా ఉండవల్లికి వచ్చి సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకున్న రీతిలోనే.. నామినేటెడ్ పదవుల్లోనూ బీజేపీకి ప్రాతినిధ్యం కావాలని ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. అందుకే, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, శివప్రకాష్ కలిసి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారన్న వార్తలు వస్తున్నాయి. బీజేపీ విషయంలో టీడీపీ కూడా సానుకూలంగానే ఉందనే వార్తలొస్తున్నాయి.
విజయవాడలోని పురందేశ్వరి నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో శివ ప్రకాష్ సమావేశం అయ్యారు. నామినేటెడ్ పదవుల విషయంపై ప్రధానంగా చర్చ జరిగిందని తెలుస్తోంది. ముందుగా పార్టీలో చర్చించుకున్న తరువాతే.. పురందేశ్వరి, శివప్రకాష్ వెళ్లి చంద్రబాబును కలిశారు. గత ఎన్నికల్లో ఎలాంటి సమన్వయంతో అయితే కూటమి ఎన్నికలకు వెళ్లిందో.. ఇప్పుడు కూడా అదే రీతిలో వెళ్లేలా చంద్రబాబుతో చర్చించడం జరిగిందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తెలిపారు.
పార్టీ కోసం పనిచేసిన బీజేపీ కార్యకర్తలు.. నామినేటెడ్ పదవులు కోరుకోవడంలో తప్పులేదన్నారు మంత్రి సత్యకుమార్. పదవులు, బాధ్యతలు అప్పగిస్తే మరింత చురుగ్గా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని, దానిపై కూటమిలో చర్చ జరుగుతోందన్నారు. మరోవైపు.. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపైనా కసరత్తు చేస్తోంది ఆ పార్టీ. దీనికి సంబంధించి.. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ నేతలంతా చురుగ్గా పాల్గొనేలా దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఏపీలో నామినేటెడ్ పదవుల విషయంలో మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉందనైతే అర్ధమవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీనే మేజర్ సీట్లు తీసుకుంది కాబట్టి.. నామినేటెడ్ పదవుల విషయంలో బీజేపీ, జనసేన ఎక్కువగా పోస్టులు అడుగుతాయా అనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతోంది.
What's Your Reaction?