AP: ఘోర ప్రమాదం.. తీవ్ర విషాదం
అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు... ఇప్పటివరకూ 17మంది మృతి
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి, 17 మంది మరణించారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మందుల తయారీలో ఉపయోగించే 500 కేఎల్ సామర్థ్యం గల రియాక్టర్ బుధవారం మధ్యాహ్నం పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏసీ యూనిట్లకు మంటలు అంటుకుని.. క్షణాల్లో వ్యాపించాయి. రియాక్టర్ పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోవడంతో పాటు, అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమ భవనం దెబ్బతింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని భావించి.. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో 3 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
శిథిలాల తొలగింపు కోసం భారీ క్రేన్లను అధికారులు తెప్పించారు. కొన్ని గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అంబులెన్సుల్లో మృతదేహాలు, బాధితులను తరలిస్తున్నారు. శిథిలాల తొలగింపు పూర్తయితే కానీ మృతులు, క్షతగాత్రుల సంఖ్య తేల్చ లేని పరిస్థితిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పకూలిన పరిశ్రమ శిథిలాల కింద కార్మికులు నుజ్జునుజ్జయ్యారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పని చేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొత్తం 12 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపుచేశాయి.
మృతుల వివరాలు
1. నీలాపు రామిరెడ్డి, ఏజీఎం, వెంకుజీపాలెం
2. ప్రశాంత హంస, సీనియర్ ఎగ్జిక్యూటివ్, పొందూరు, శ్రీకాకుళం
3. నారాయణరావు మహంతి, అసిస్టెంట్ మేనేజర్, గరివిడి, విజయనగరం
4. గణేష్‌కుమార్ కొరపాటి, సీనియర్ ఎగ్జిక్యూటివ్, బిక్కవోలు, తూర్పుగోదావరి
5. హారిక చెల్లపల్లి, ట్రైనీ ఇంజినీర్, కాకినాడ
6. రాజశేఖర్ పైడి, ట్రైనీ ప్రాసెస్ ఇంజినీర్, ఆమదాలవలస, శ్రీకాకుళం
7. సతీష్ మారిశెట్టి, సీనియర్ ఎగ్జిక్యూటివ్, మామిడికుదురు, కోనసీమ
8. నాగబాబు మొండి, అసిస్టెంట్ మేనేజర్, సామర్లకోట
9. బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు, అసిస్టెంట్ మేనేజర్, కూర్మన్నపాలెం, విశాఖపట్నం
10. వేగి సన్యాసినాయుడు, హౌస్ కీపింగ్‌బాయ్, రాంబిల్లి మండలం
11. చిన్నారావు ఎలబల్లి, పెయింటర్, దిబ్బపాలెం
12. పార్థసారథి, ఫిట్టర్, పార్వతీపురం మన్యం
13. మోహన్ దుర్గాప్రసాద్ పూడి, హౌస్‌కీపింగ్ బాయ్, దిబ్బపాలెం
14. ఆనందరావు బమ్మిడి, ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్, గొల్లపేట, పూసపాటిరేగ, విజయనగరం
15. సురేంద్ర మర్ని, ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్, ఉట్లపల్లి, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా
16. పూసర్ల వెంకటసాయి, సీనియర్ ఎగ్జిక్యూటివ్, బంగారమ్మపాలెం, అనకాపల్లి జిల్లా
17. జవ్వాది చిరంజీవి, ఇంజినీరింగ్ విభాగం, దార్లపూడి, ఎస్.రాయవరం మండలం, అనకాపల్లి జిల్లా
What's Your Reaction?