AP: దస్త్రాల దహనం వెనక మద్యం కుంభకోణం
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల కాల్చివేత వెనుక భారీ కుట్ర
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల కాల్చివేత వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. పెద్దిరెడ్డి అనుచరుల నివాసాల్లో జరిపిన సోదాల్లో సీఐడీకి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మిథున్‌రెడ్డి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం జరిగిందని ఇప్పటికే ఫిర్యాదులు అందగా... దానికి సంబంధించిన కీలక పత్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో దస్త్రాల దహనం వెనక మద్యం కుంభకోణం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ బృందాలు... మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైన వి.మాధవరెడ్డి, పీఏ శశికాంత్ నివాసాల్లో తనిఖీలు నిర్వహించాయి. వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు ఐపాడ్, పెన్‌డ్రైవ్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, వివిధ బ్యాంకుల చెక్కులు, సేల్‌డీడ్‌లు, నగదు లావాదేవీల వివరాలున్న కాగితాలు, కొన్ని రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిని విశ్లేషిస్తుంటే జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన లావాదేవీల వివరాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది.
కొన్ని కీలక ఆధారాలూ లభ్యమైనట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వంలోనూ, ఆ పార్టీలోనూ ముఖ్య నేతగా చలామణీ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.. కనుసన్నల్లో గత అయిదేళ్లలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఫిర్యాదులున్నాయి. తాజాగా పెద్దిరెడ్డి అనుచరులు, సన్నిహితుల ఇళ్లల్లో నిర్వహించిన తనిఖీల్లో మద్యం కుంభకోణం లావాదేవీలు బయటపడిన నేపథ్యంలో వాటిపై సీఐడీ మరింత లోతుగా కూపీ లాగుతోంది. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపటం, తాము అడిగినంత కమీషన్ చెల్లించేందుకు అంగీకరించిన వారికే సరఫరా ఆర్డర్లు ఇచ్చేలా చూడటం, వారి నుంచి వసూలు చేసిన ‘జే ట్యాక్స్’’ను ‘బిగ్‌బాస్’కు చేర్చటంలో మిథున్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారన్న ఫిర్యాదులున్నాయి.
వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని తెర ముందు పెట్టుకుని మొత్తం అక్రమ దందా నడిపించారన్న విమర్శలున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ఈ కుంభకోణంలో పాత్రధారులైన అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆధారాలన్నీ ధ్వంసం చేయాలని, దాని ఆనవాళ్లే లేకుండా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో అతి పెద్ద డిస్టిలరీల్లో ఒకటైన నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, కృష్ణా జిల్లాలోని సెంటినీ బయోప్రొడక్ట్స్ డిస్టిలరీలను మిథున్‌రెడ్డి అనధికారికంగా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారన్న ఫిర్యాదులున్నాయి.
What's Your Reaction?