AP: నిర్లక్ష్యమే పేలుడుకు కారణమా..?
అచ్యుతాపురం పేలుడు ఘటనలో కీలక విషయాలు బహిర్గతం... రసాయనం లీక్‌ను గుర్తించినా నిర్లక్ష్యం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ పేలుడుకు సంబంధించి కీలక విషయాలు బహిర్గతమవుతున్నాయి. ఈ పేలుడుకు గంటన్నర ముందే సిబ్బందికి ప్రమాద సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. బల్క్ డ్రగ్ తయారీలో ఉపయోగించే మిథైల్ టెర్ట్ బ్యూటైల్ ఈథర్ రసాయనం లీక్ కాగా, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, కంపెనీ అధికారులు తేలిగ్గా తీసుకోవడంతో భారీ ప్రమాదం సంభవించినట్లు ఉన్నతస్థాయి విచారణ కమిటీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తక్షణం స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదనే భావనకు వచ్చారు. ఈ మేరకు ప్రాథమిక విచారణలో గుర్తించిన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ నెల 21న ఎసెన్షియా కంపెనీలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోనే రెండో అంతస్తులో ఎంటీబీఈ రసాయనం లీకవుతున్న విషయాన్ని ప్రొడక్షన్ బృందం గుర్తించింది. స్వీట్ లిక్కర్ వాసన రావడాన్ని కొందరు గమనించారు. తర్వాత మొదటి అంతస్తులోనూ అదే వాసన రావడంతో అప్రమత్తమయ్యారు. అప్పుడు మధ్యాహ్న భోజన సమయం కావడంతో సిబ్బంది ఎవరూ లీకేజీని అరికట్టేందుకు ముందుకు రాలేదు. గంటన్నర సమయం గడిచిపోయింది. ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ల ద్వారా లీకైన ఎంటీబీఈ రసాయనం ఆవిరి రూపంలో అన్ని గదులకు వ్యాపించింది. అత్యంత పేలుడు గుణమున్న ఈ రసాయనంలో కొన్ని చుక్కలు గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎలక్ట్రిక్ ప్యానల్స్‌పై పడ్డాయి. దీంతో చిన్న స్పార్క్ రేగి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. అప్పుడే గోడలు, సీలింగ్ కూలిపోయాయి. వాటి కింద కొందరు పడి చనిపోయారు. సమీపంలో ఉన్నవారు తప్పించుకునే అవకాశం లేకుండా 5-10 సెకన్ల వ్యవధిలోపే అదే ఫ్లోర్‌లో ఏహెచ్‌యూ మెయిన్ ప్యానల్‌లో మరో పేలుడు సంభవించింది. దీని ధాటికి పీడీ ల్యాబ్, యుటిలిటీ, ప్రొడక్షన్ ఏరియా మొత్తం ధ్వంసమైంది. అక్కడ సిబ్బంది ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్మాగార నిర్మాణంలోని లోపాలు కార్మికుల పాలిట శాపాలుగా మారాయి. అత్యవసర సమయాల్లో కంపెనీ నుంచి బయటపడే మార్గమే లేదు.
అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్‌జీటీ సీరియస్ అయ్యింది. ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న ఎన్‌జీటీ.. 17 మంది కార్మికుల మృతిచెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అనకాపల్లి కలెక్టర్, ఏపీ పొల్యూషన్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ పరిశ్రమల శాఖ,సీపీసీబీలతో పాటు కేంద్ర పర్యావరణ శాఖకు కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే, రెండు రోజుల వ్యవధిలో ఏపీలో జరిగిన మూడు ఘోరమైన ప్రమాదాలను జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా పరిగణించింది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.
What's Your Reaction?