AP: పోలవరానికి నిధుల విడుదల లాంఛనమే..!

కేంద్ర మంత్రి మండలి ఆమోదమే తరువాయి... ఇప్పటికే కేంద్రమంత్రితో చంద్రబాబు చర్చ

Aug 24, 2024 - 12:28
 0  3
AP: పోలవరానికి నిధుల విడుదల లాంఛనమే..!

పోలవరానికి నిధుల విడుదల లాంఛనమే కానుంది. నిధుల విడుదలకు సంబంధించి ఇప్పటికే అన్ని స్థాయిల అధికారులు ఆమోద ముద్ర వేశారు. ఇక కేంద్ర మంత్రి మండలి ఆమోదమే మిగిలి ఉంది. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యంగా ఉండటం, కేంద్ర బడ్జెట్లో కూడా ఏపీకీ అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి అన్ని విధాల సహాయ, సహకారాలు ఉంటాయని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అందులోనూ కేంద్రంలోనూ ఏపీది కీలకపాత్ర. దీంతో పోలవరానికి సంబంధించి నిధుల విడుదల విషయంలో ఎటువంటి జాప్యం ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.30,436.95 కోట్లతో సిద్ధమైన డీపీఆర్‌ (పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక)ను కేంద్ర మంత్రిమండలి వచ్చే వారం ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని స్థాయులు దాటిన పోలవరం డీపీఆర్‌... మంత్రిమండలి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. పీఎంఓ ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ఈ ప్రతిపాదనను మంత్రిమండలి ముందు ఉంచుతుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహామండలి, రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఈ మొత్తానికి ఆమోదముద్ర వేశాయి. ఇక కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తే నిధుల విడుదలకు ఆస్కారం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం తీసుకువెళ్లారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ మాట్లాడారు. తదుపరి కేంద్ర మంత్రిమండలి ముందుకు ఈ ప్రతిపాదన వెళ్లనున్నట్లు రాష్ట్ర అధికారులకు వర్తమానం అందింది. ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర మంత్రిమండలి సమావేశం ఉంది.

అడ్వాన్స్‌గా రూ.12 వేల కోట్లు ఇస్తుందా?

తాజా డీపీఆర్‌ ఆమోదం పొందితే పోలవరానికి రూ.12,157.53 కోట్లు అందుబాటులోకి వస్తాయి. మిగిలిన మొత్తం ఇప్పటికే రీయింబర్స్‌ చేసినందున ఆ నిధులు అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తం నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 2016 తర్వాత నాబార్డుతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుని వారినుంచి కేంద్రం రుణం రూపంలో పొంది రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వబోయే రూ.12వేల కోట్లకు పైగా నిధులను అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం తొలుత ఖర్చుచేస్తే ఆనక కేంద్రం రీయింబర్స్‌ చేస్తోంది. నిజానికి జాతీయ ప్రాజెక్టుల్లో కేంద్రమే తొలుత అడ్వాన్స్‌గా నిధులివ్వాలని గతంలో జలవనరులశాఖ ఉన్నతాధికారులుగా పనిచేసిన వారు కూడా పోలవరం అథారిటీ ముందు ప్రస్తావిస్తూ వచ్చారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News