AP: మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు సమీక్ష

సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం... ఎలాంటి ఇబ్బందీ లేకుండా విధానాలను రూపొందించాలని నిర్దేశం

Aug 23, 2024 - 11:17
 0  1
AP: మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీఎస్‌ఆర్టీసీ, రవాణాశాఖలపై సమీక్ష నిర్వహించిన ఆయన... కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని, కొంత ఆలస్యమైనా.. ఎలాంటి లోపాలకూ తావులేకుండా, మహిళలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా విధానాలను రూపొందించాలని చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పరిశీలించి నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ, పంజాబ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరు, అందులో లోటుపాట్లను పరిశీలించాలని కోరారు. కేంద్రం ఇస్తున్న రాయితీని వినియోగించుకొని 1,253 విద్యుత్‌ బస్సులు సమకూర్చుకోవాలని సూచించారు.

ప్రస్తుతమున్న డీజిల్‌ బస్సుల నుంచి క్రమంగా విద్యుత్‌ బస్సుల్లోకి మారేందుకు ఆర్టీసీ అధికారులు ఓ ప్రణాళిక రూపొందించాలని... గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు తగ్గించిన బస్సు సర్వీసులన్నీ, పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజలు ఎవరూ రవాణాశాఖ కార్యాలయాలకు రాకుండా, అన్ని సేవలూ ఆన్‌లైన్‌లో లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు సీసీ కెమెరాల ద్వారా ఈ-చలానాలు జారీచేయాలని, దీనికోసం అవసరమైతే అదనంగా సీసీ కెమెరాలు కొనుగోలు చేయాలన్నారు. 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకుండా తుక్కు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడంపై ప్రధానంగా దృష్టిపెట్టాలని... బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద నివారణ పనులు చేపట్టాలి. రహదారి భద్రతపై కలెక్టర్, ఎస్పీ, సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలన్నారు.

ఉచిత ఇసుక సరఫరాపైనా చంద్రబాబు సమీక్ష

ఉచిత ఇసుక సరఫరా సమీక్షలో చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ప్రతి రోజూ ఇసుక సరఫరా జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. ఇసుక సరఫరాలో ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ, ఈమెయిల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్: 1800-599-4599, ఈ మెయిల్-ఐడి: dmgapsandcomplaints@yahoo.com లను సర్కారు ఏర్పాటు చేసింది. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఉచిత ఇసుక విధానంపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసుక రవాణ ఛార్జీలను నోటిఫై చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఉచిత ఇసుక సరఫరాపై ప్రతి రోజూ జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News