AP: మిశ్రమం లీకవ్వడం వల్లే ఘోర ప్రమాదం
రియాక్టర్ పేలుడు వల్ల కాదని ప్రాథమికంగా నిర్దారణ... ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేత
అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. రియాక్టర్ పేలడం వల్ల కాదని.. సాల్వెంట్ లీకవడం వల్లే ప్రమాదం జరిగిందని ఫ్యాక్టరీస్ విభాగం డైరెక్టర్ చంద్రశేఖరవర్మ తెలిపారు. ‘రియాక్టర్‌లో తయారైన మిథైల్ టెర్ట్- బ్యుటైల్ ఈథర్ మిశ్రమాన్ని స్టోరేజీ ట్యాంకులోకి మార్చే సమయంలో ఆ మిశ్రమం లీకైందని.... ప్రొడక్షన్ బ్లాక్‌లోని రియాక్టర్ నుంచి పీడీ ల్యాబ్ ద్వారా ట్యాంకులోకి రసాయనాన్ని సరఫరా చేసే సమయంలో లీకేజి ఏర్పడిందని గుర్తించారు. ఆ మిశ్రమం బయటకు వచ్చి వాతావరణ రసాయన చర్యల వల్ల ఆవిరిగా మారిందని... ఆ వాయువు సాధారణ వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు సంభవించిందని తెలిపారు. అదే సమయంలో మంటలు వ్యాపించాయన్నారు.
రియాక్టర్ నుంచి డే ట్యాంక్‌కు మెటీరియల్ వెళ్లే పైపులైనుకు లీకేజి ఏర్పడిందని... ఆ మిశ్రమం.. కింద ఉన్న ఎలక్ట్రికల్ ప్యానల్‌పై పడటం వల్ల ఆవిరిగా మార్పు చెంది మంటలు చెలరేగడానికి కారణమైందన్నారు. ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టం ద్వారా కూలింగ్ ప్రక్రియ నిర్వహించే వ్యవస్థ కర్మాగారంలో ఉంది. రసాయనం బయటకు రావడం ద్వారా ఏర్పడిన ఆవిరిని కూడా కూలింగ్ డక్ట్‌లోకి తీసుకుందని వెల్లడించారు. దీంతో డక్ట్‌లు కూడా పేలాయని... దీనివల్ల ఫాల్స్ సీలింగ్ పడిపోయిందన్నారు. పేలుడు ధాటికి పరిశ్రమ భవనం గోడలు కూలి, కార్మికులపై పడ్డాయి. రియాక్టర్ నుంచి పంపే మెటీరియల్ మైనస్ 32.7 డిగ్రీల దగ్గర కూడా ఆవిరిని ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఆ సమయంలో మంటలు చెలరేగేందుకు వాయువులు దోహదం చేస్తాయి. తక్కువ డిగ్రీల దగ్గర ఉన్న రసాయనాలకు మండే గుణం తీవ్రంగా ఉంటుంది. బహిరంగ ప్రదేశమైతే తీవ్రత అంతగా ఉండదు. ప్రమాదం జరిగిన ప్రాంతం క్లోజ్డ్‌గా ఉండటం వల్ల పేలుడుకు సీలింగ్ కుప్పకూలి పని చేస్తున్న కార్మికులపై పడింది’ అని వివరించారు.
కోటీ పరిహారం ఇవ్వాలన్న జగన్
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని కోరారు. వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
What's Your Reaction?