16 ఏళ్ళలోపు వారికి సోషల్ మీడియా నిషేధం.. బిల్లుకు ఆమోదం ఎక్కడంటే ?
16 ఏళ్ళలోపు వారికి సోషల్ మీడియా నిషేధం.. బిల్లుకు ఆమోదం ఎక్కడంటే ?
ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు సిద్ధం అయ్యింది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా ఓ చట్టం తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఈరోజు (బుధవారం) ఆమోదం తెలిపింది. ఇక, దీనికి సెనెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అది చట్టరూపం దాల్చుతుంది. కాగా, ఇవాళ ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టగా 102 ఓట్లతో ఆమోదం లభించింది. మెజార్టీ పార్టీలు దీనికి అనుకూలంగా ఓటు వేశాయి. సభలో 13 మంది మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించారు. ఒకవేళ ఈ వారంలోనే ఇది చట్ట రూపం దాల్చితే.. సోషల్ మీడియా దీనిపై ఆదేశాలు జారీ చేయనుంది.
కాగా, ఇటీవల ఈ చట్టం గురించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్.. కాన్ బెర్రాలోని ఓ మీటింగ్ మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయస్సులోపు పిల్లలు సోషల్ మీడియా వల్ల తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో కొత్త చట్టం అమలు చేసే బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని ఆయన స్పష్టం చేశారు. తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆసీస్ ప్రధాన మంత్రి తెలిపారు. సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి పిల్లల్ని కాపాడేందుకు అమెరికా సహా చాలా దేశాలు చట్టం తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నాయని చెప్పుకొచ్చారు.
16 ఏండ్ల లోపు పిల్లల సామాజిక మాధ్యమ ఖాతాలను నిరోధించడంలో వ్యవస్థాగతంగా విఫలమైతే సామాజిక మాధ్యమాలకు 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించారు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.273 కోట్లకు పైమాటే. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, రెడిట్ తదితర మాధ్యమాలకు ఈ చట్టం వర్తించనుంది. ఒకవేళ ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కుతుంది.
What's Your Reaction?