CBN: ఆలయాల్లో అన్య మతస్థలు ఉండకూడదు
మత మార్పిళ్లకు ఆస్కారమే ఉండకూడదు... దేవాదాయశాఖ సమీక్షలో స్పష్టం చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిళ్లు జరుగుతుండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎక్కడా బలవంతపు మతమార్పిళ్లు ఉండకూడదని... ఆ దిశగా దేవాదాయశాఖ కార్యక్రమాలు అమలుచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి... భక్తుల మనోభావాల కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. దేవాదాయశాఖపై సచివాలయంలో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఆలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని.. భక్తుల జేబులు ఖాళీచేసేలా కాకుండా, ఇష్టపూర్వకంగా అక్కడ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. శుభ్రతలో రాజీపడకూదని... ఆర్భాటానికి కాదు.. పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
కీలక నిర్ణయాలు
ఆలయాలు అత్యధికంగా పర్యాటక, అటవీ ప్రాంతాల్లో ఉండటంతో.. వీటి అభివృద్ధికి దేవాదాయ, అటవీ, పర్యాటకశాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆలయ భూముల్లో ఆక్రమణల తొలగింపు, దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు ఓ కమిటీ వేసేలా ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రసాదం, అన్నదానం నాణ్యంగా ఉండాలని.. ఎక్కడైనా బాగోలేదని ఫిర్యాదులు వస్తే.. ఆలయ అధికారులే బాధ్యులవుతారని... ప్రధాన ఆలయాల్లో ఎంతమంది భక్తులు తింటే, అందరికీ అందించాలని చంద్రబాబు ఆదేశించారు. తొలుత 61 ప్రధాన, ముఖ్య ఆలయాల్లో సేవలన్నీ ఆన్‌లైన్‌లో, నగదురహితంగా అందించాలని... తర్వాత మిగిలిన ఆలయాలకు వర్తింపజేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో రథాల దహనం, ఆలయాల ధ్వంసాల కేసులపై దేవాదాయ మంత్రి పర్యవేక్షించాలి. నిందితులు తప్పించుకోకుండా, అందరికీ శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు.
1,110 ఆలయాలకు కొత్త పాలకవర్గాలను నియమించాలని.... ఇకపై ప్రతి పాలకవర్గంలో ఇద్దరు సభ్యులను పెంచాలని... ఇందుకు చట్టసవరణకు ప్రతిపాదన సిద్ధం చేయాలన చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే పాలకవర్గ సభ్యుల్లో ఓ నాయీబ్రాహ్మణుడికి అవకాశం ఉండగా, కొత్తగా ఓ బ్రాహ్మణుడికి సభ్యుడిగా చోటు కల్పించాలని సూచించారు. బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలను బలోపేతం చేయాలని... వీటికి కొత్త పాలకవర్గాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నిరుద్యోగ వేద విద్యార్థులకు రూ.3వేల భృతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
What's Your Reaction?