CBN: అచ్యుతాపురం ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
అత్యవసరంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. బాధితులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలు తెలుసుకున్నారు. అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. ఇప్పటి వరకు 17 మంది చనిపోయారని అధికారులు వివరించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఏంటనే విషయంలో ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు అధికారులు వివరించారు.
ప్లాంట్ నిర్వహణలో మానవ తప్పిదం, ప్లాంట్ నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వెల్లడించారు. ప్రమాదం అనంతరం ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సరిగా లేదని స్పష్టం చేశారు. ముందు బాధితుల ప్రాణాలు కాపాడడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఉలిక్కిపడ్డ అచ్యుతాపురం
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి, 17 మంది మరణించారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మందుల తయారీలో ఉపయోగించే 500 కేఎల్ సామర్థ్యం గల రియాక్టర్ బుధవారం మధ్యాహ్నం పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏసీ యూనిట్లకు మంటలు అంటుకుని.. క్షణాల్లో వ్యాపించాయి. రియాక్టర్ పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోవడంతో పాటు, అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమ భవనం దెబ్బతింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని భావించి.. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో 3 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
What's Your Reaction?