CBN: డ్వాక్రా మహిళలకు, విద్యార్థలకు విద్యుత్ సైకిళ్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన... ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీపై విద్యుత్ సైకిళ్లను అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుపై ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం సమీక్షించారు. 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేశామని, జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వాటిలో 60 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని విమర్శించారు. వాటిని సరిచేయడంతో పాటు కొత్త ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ ఇంధన సామర్థ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని.... ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా నిర్మించిన ఇళ్లలో ఇంధన సామర్థ్య విద్యుత్ ఉపకరణాలను రాయితీపై అందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకూ విద్యుత్ పరికరాలు సబ్సిడీపై అందించనున్నామని తెలిపారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వ భవనాల్లో సౌర విద్యుత్ వినియోగించబోతున్నామని పేర్కొన్నారు. దీపం పథకం కింద ప్రభుత్వం అందించే మూడు గ్యాస్ సిలిండర్లకు బదులు.. ఒక ఇండక్షన్ స్టౌ, రెండు సిలిండర్లు అందించడం వల్ల గ్యాస్ వినియోగం తగ్గి, లబ్ధిదారులకు ఏటా రూ.2,433 కోట్లు ఆదా అవుతుందని, పథకం అమలుకు ప్రభుత్వం చేసే ఖర్చులో రూ.1,261 కోట్లు మిగులుతుందని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు.
దేవాలయాలపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిళ్లు జరుగుతుండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎక్కడా బలవంతపు మతమార్పిళ్లు ఉండకూడదని... ఆ దిశగా దేవాదాయశాఖ కార్యక్రమాలు అమలుచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి... భక్తుల మనోభావాల కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. దేవాదాయశాఖపై సచివాలయంలో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఆలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని.. భక్తుల జేబులు ఖాళీచేసేలా కాకుండా, ఇష్టపూర్వకంగా అక్కడ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. శుభ్రతలో రాజీపడకూదని... ఆర్భాటానికి కాదు.. పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
What's Your Reaction?