Kolkata doctor case: విద్యా శాఖ మూడు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
వైద్యురాలిపై హత్యాచారం.. నిరసనల్లో పాల్గొనటమే కారణం
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమబెంగాల్‌ను కుదిపేస్తోంది. అయితే, ఈ నిరసనల్లో పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటున్నారనే ఆరోపణలు రావడంతో బెంగాల్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అనేక పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
“ఆగస్టు 23న పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల వేళల్లో ర్యాలీలో పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా విద్యార్థులు రోడ్లపైకి రావడం వారికి ఏ మాత్రం సురక్షితం కాదు. ఇది బాలల హక్కుల ఉల్లంఘన. ఈ విషయంపై పాఠశాలల యాజమాన్యాలు 24గంటల్లోగా నివేదిక సమర్పించాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని రాష్ట్ర ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. హౌరా, బంకురా, మిడ్నాపూర్‌లోని పలు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
విద్యార్థులతో పాటు పలువురు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కూడా ర్యాలీలో పాల్గొన్నారని.. ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ విషయంలో సరైన సమాధానాలు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరగతుల సమయంలో విద్యార్థులు ఇలాంటి ర్యాలీల్లో పాల్గొనకూడదని పేర్కొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది విద్యార్థులను ర్యాలీకి తీసుకెళ్లినట్లు తమకు తెలిసిందని విద్యాశాఖ తెలిపింది.
ఈ పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి ముందు.. పాఠశాల లేదా డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలలో విద్యార్థులు పాల్గొనడం నిషేధించబడుతుందని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యార్థులు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని జిల్లా ఇన్‌స్పెక్టర్ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా వైద్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ ర్యాలీల్లో విద్యార్థులను చేర్చుకుంటున్నట్లు వార్తలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు జిల్లా ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అయితే.. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన సంఘటన గురించి నోటీసులో ప్రస్తావించలేదు.
What's Your Reaction?