Gudlavalleru: లేడీస్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు కలకలం.. సంఘటనపై విచారణ
Gudlavalleru: లేడీస్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు కలకలం.. సంఘటనపై విచారణ… గుడ్లవల్లేరు ఎస్‌ఆర్‌జీ ఇంజినీరింగ్ కళాశాలలో తీవ్ర కలకలం... నిరసనలతో కదం తొక్కిన విద్యార్థినులు
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఎస్‌ఆర్‌జీ ఇంజినీరింగ్ కళాశాల బాలికల వసతిగృహంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారన్న సమాచారం తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రకటనతో విద్యార్థినులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచి విద్యార్థినులు కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. రహస్య కెమెరాలను కనిపెట్టే వరకూ తాము హాస్టల్‌కు వెళ్లలేమంటూ విద్యార్థినులు బైఠాయించి ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. యాజమాన్యం సరిగా స్పందించలేదని విద్యార్థినులు, తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వసతిగృహంలోని స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై మూడురోజుల క్రితం కొందరు విద్యార్థినులు వార్డెన్ పద్మావతికి ఫిర్యాదు చేశారు. వార్డెన్ విద్యార్థినులపైనే కేకలు వేయడంతో చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయారు. ఈ వ్యవహారం విద్యార్థుల్లో ప్రచారం జరిగి.. బయటకు పొక్కి, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.
కొందరు విద్యార్థులు ఎస్‌ఆర్‌జీ ఇంజినీరింగ్ కళాశాల సూపరింటెండెంట్ రవీంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. నాలుగో సంవత్సరం విద్యార్థి.. అదే కళాశాలలో మరో విద్యార్థిని ప్రేమలో ఉన్నారని.. వారి ద్వారా విషయం తెలిసిందని చెప్పారు. ఆయన వారిద్దరినీ పిలిచి సెల్‌ఫోన్లు పరిశీలించి, చిన్న విషయంగా భావించి పంపేశారు. సూపరింటెండెంట్ రవీంద్రబాబు ఈ ఘటనను చిన్న విషయంగా తీసుకోవడంపై తీవ్రంగా కలత చెందిన విద్యార్థినులు రాత్రి పది గంటలకు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. కొందరు తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఆరాతీశారు. అనంతరం అందరూ అక్కడే ఆందోళనకు దిగారు. రాత్రి 11 గంటలకు గుడ్లవల్లేరు ఎస్‌ఐ, గుడివాడ రూరల్ సీఐ అక్కడికి చేరుకున్నారు. వీడియోలపై విద్యార్థినులు వారికి ఫిర్యాదుచేశారు. దీంతో ఆరోపణలు వచ్చిన ఇద్దరి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తీసుకుని పదిమంది విద్యార్థుల సమక్షంలో పరిశీలించారు. వాటిలో వీడియోలేమీ లేవని గుర్తించారు. వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్, స్క్రీన్‌షాట్లు లభించాయి. ఇదే విషయం విద్యార్థులకు తెలిపారు.
కానీ విద్యార్థులు సంతృప్తి చెందలేదు. స్నానాలగదుల్లో రహస్య కెమెరాలు ఉన్నాయని, 300 వీడియోలు బయటకు వెళ్లాయని ఫిర్యాదుచేశారు. విద్యార్థుల ఆందోళన చినికిచినికి గాలివానగా మారింది. అర్ధరాత్రి వరకు నిరసన కొనసాగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక సాంకేతిక బృందంతో కమిటీ ఏర్పాటుచేశారు. ఆరోపణలు వచ్చిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిని యాజమాన్యం అదుపులో ఉంచారు. వారివద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. గుడివాడ సీసీఎస్ సీఐ రమణమ్మ, సాంకేతిక విభాగం ఎస్‌ఐ మాధురి, మరో ముగ్గురు కానిస్టేబుళ్లతో కమిటీ వేశారు. ఈ కమిటీ విచారణ చేసి నివేదిక ఇస్తుందని.. దోషులపై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. వార్డెన్ పద్మావతిని సస్పెండ్ చేయాలని కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించారు.
What's Your Reaction?