Gujarat Rains | భారీ వర్షాలతో గుజరాత్ అస్తవ్యస్తం.. సౌరాష్ట్ర రీజియన్లో రెడ్ అలర్ట్..!
Gujarat Rains | రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గుజరాత్ అస్తవ్యస్తమైంది. వడోదరలో 2500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Gujarat Rains | ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రమంతా నీటిమయం అయింది. వందలాదిమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. నవ్ సారి జిల్లాలో నదులు ఉప్పొంగి ప్రవహించడంతో వరద పోటెత్తుతున్నది. ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర రీజియన్ పరిధిలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ).. ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో వల్సాడ్, తాపి, నవ్ సారి, సూరత్, నర్మద, పంచ్ మహాల్ జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది.
మోర్బీ జిల్లాలో నదిపై నిర్మించిన కాజ్ వే మీదుగా వరద పోటెత్తింది. ఈ సందర్భంగా కాజ్ వే మీదుగా వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తుల ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం ఆరు గంటల్లోపు గత 24 గంటల్లో నవ్ సారీ జిల్లా ఖేర్ గామ్ తాలూకా పరిధిలో అత్యధికంగా 356 ఎంఎం వర్షపాతం రికార్డైంది. వడోదరలోని పద్రాలో సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ 270 మి.మీ వర్షపాతం కురిసింది. నర్మద, సౌరాష్ట్ర, రాజ్ కోట్, తాపి, మహిసాగర్, మోర్బీ, దాహోద్, వడోదర జిల్లాల్లో 100 మీమీ పై చిలుకు వర్షపాతం నమోదైంది.
శ్రావణ మాసంలో పండుగల సందర్భంగా ప్రజలు భారీగా గుమికూడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. సౌత్ గుజరాత్ పరిధిలోని జిల్లాలో సగటు వర్షపాతం కంటే 105 శాతానికి పైగా వర్షపాతం రికార్డైంది. సౌత్ గుజరాత్, సౌరాష్ట్ర పరిధిలోని ఎనిమిది జిల్లాల పరిధిలో సగటు వర్షపాతం కంటే 100 శాతం వర్షపాతం కురిసింది.
What's Your Reaction?