Hanuman USA: అగ్ర రాజ్యంలో అతి పెద్ద హనుమాన్
టెక్సాస్‌లో 90 అడుగుల ఆంజనేయ విగ్రహం..
అమెరికాలోని టెక్సాస్‌లో 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి కాంస్య విగ్రహం ఏర్పాటైంది. ఇది అగ్రరాజ్యంలోనే మూడో అతిపెద్దది. దీనికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ (ఐక్యతా విగ్రహం) అని పేరు పెట్టారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటైన ఇది.. భారతదేశం వెలుపల ఉన్న అత్యంత ఎత్తైన ఆంజనేయుడి విగ్రహంగానూ రికార్డులకెక్కింది.
మనం మన దేశంలో ఎంతో ఎత్తైన దేవుడి విగ్రహాలను చూశాం. ఇప్పుడు అలాంటి భారీ విగ్రహాన్ని అమెరికాలోని టెక్సాస్‌లో ఏర్పాటు చేశారు. హ్యూస్టన్ సమీపంలో 90 అడుగుల ఎత్తైన హనుమంతుని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే.. అమెరికాలోని న్యూయార్క్‌లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (151 అడుగులు), ఫ్లోరిడాలోని హాలండేల్ బీచ్‌లోని పెగాసస్ మరియు డ్రాగన్ (110 అడుగులు), తాజాగా.. హనుమంతుడి మూడవ ఎత్తైన విగ్రహం ఉంది.
శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 18 వరకు జరిగిన మహాప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహం నిస్వార్థానికి, భక్తికి, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. రాముడు, సీతను ఏకం చేయడంలో హనుమంతుడి పాత్రను దృష్టిలో ఉంచుకుని దీనికి స్టాట్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టినట్లు నిర్వహకులు తెలిపారు.
“పద్మభూషణ్ విజేత, ప్రముఖ వేద పండితుడు శ్రీ చిన్న జీయర్ స్వామీజీ యొక్క దూరదృష్టితో ఈ విగ్రహం సాధ్యపడింది. ఆగస్టు 15న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 18న మహా సంప్రోక్షణ వేడుకలు ప్రారంభమయ్యాయి” అని నిర్వహకుల్లో ఒకరు చెప్పారు. “శ్రీ చిన్న జీయర్ స్వామీజీ మరియు వేద అర్చకులు, పండితుల నాయకత్వం కారణంగా ఈ పండుగ ఆధ్యాత్మికతకు అద్భుతమైన ప్రదర్శనగా మారింది.” అని పేర్కొన్నారు.
ఈ విగ్రహం ప్రారంభోత్సవ వేడుకలో హెలికాప్టర్ ద్వారా విగ్రహంపై పూల వర్షం కురిపించారు. అలాగే.. గంగాజలం చల్లారు. వేలాది మంది భక్తులు శ్రీ రామ్, జై హనుమాన్ నామస్మరణల మధ్య హనుమంతుడి మెడలో 72 అడుగుల పొడవైన దండను వేశారు. ఈ విగ్రహం హనుమంతుని అచంచలమైన స్ఫూర్తికి ప్రతీకగా ఉండటమే కాకుండా.. అమెరికా సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో కొత్త మైలురాయిని కూడా సూచిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
What's Your Reaction?