Home Loans | మధ్యతరగతి ఇండ్ల కొనుగోలు దారులకు ఐదు శాతంపై రూ.25 లక్షల రుణ పరపతి కల్పించాలి.. నారెడ్కో..!
ఐదు శాతం వడ్డీరేటుపై రూ.25 లక్షల వరకూ మధ్యతరగతి వర్గ ప్రజలకు ఇండ్ల కొనుగోలుకు రుణం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని నారెడ్కో అధ్యక్షుడు జీ హరిబాబు కోరారు.
Home Loans | ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. దాని సాకారం కోసం సుదీర్ఘ కాలం ప్రణాళికతో ముందుకు సాగుతుంటారు. ప్రస్తుతం ఇండ్ల ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో మధ్యతరగతి వర్గ ప్రజలకు వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) అధ్యక్షుడు జీ హరిబాబు కోరారు. ఐదు శాతం వడ్డీరేటుపై రూ.25 లక్షల వరకూ మధ్యతరగతి వర్గ ప్రజలకు ఇండ్ల కొనుగోలుకు రుణం ఇవ్వాలని కోరారు. మొత్తం దేశ జనాభాలో 30 శాతం మంది మధ్యతరగతి వర్గ ప్రజలు. వారంతా అద్దె ఇండ్లలోనే నివసిస్తుంటారు. ప్రస్తుతం ఇండ్ల రుణాలపై బ్యాంకులు 8.75 నుంచి 9 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. దీనివల్ల ఈఎంఐలు భారీగా ఉంటున్నాయి. ఈ పరిస్థితి నుంచి మధ్య తరగతి వర్గ ప్రజలను రక్షించడానికి రూ.25 లక్షల రుణ పరపతి కల్పించాలని హరిబాబు కేంద్రాన్ని కోరారు.
‘30 శాతం మంది మధ్యతరగతి వర్గ ప్రజల్లో మెజారిటీ రూ.50 వేల నుంచి రూ.70 వేల మధ్య వేతనం అందుకుంటున్నారు. వీరు ఈఎంఐల రూపంలో నెలకు రూ.15,000-20,000 చెల్లించగలరు. రూ.20 వేల ఈఎంఐ ప్రాతిపదికన ఇంటి కొనుగోలుకు రూ.20 లక్షల రుణం మాత్రమే లభిస్తుంది. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఇండ్ల నిర్మాణ ప్రాజెక్టులు చేపడుతున్న రియాల్టీ సంస్థలు రూ.20 లక్షల్లోపు ధరకు మధ్య తరగతి వర్గ ప్రజలకు ఇండ్లు సమకూర్చ గలవా?. రూ. లక్ష లోపు వేతనం తీసుకుంటున్న వారికి ఈ అవకాశమే లేదు’ అని హరిబాబు పేర్కొన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు, ఇండ్ల అద్దెలు భారీగా పెరిగిపోయాయి. 2019 నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు 45 శాతం పెరిగితే, ఇండ్ల అద్దెలు 64 శాతం పెరిగాయి. ‘ఐదు శాతం ఫిక్స్డ్ వడ్డీరేటుపై తొలి ఐదేండ్లలో రూ.20 లక్షల ఇంటి రుణం కల్పిస్తే ఈఎంఐ రూ.16 వేల నుంచి రూ.17 వేలకు దిగి వస్తుంది. వన్ బెడ్ రూమ్, ఒక హాలు, కిచెన్ గల ఇల్లు కొనుగోలు చేయడానికి వారు మరో రూ.10-15 లక్షలు రెగ్యులర్ వడ్డీరేటుపై రుణం పొందే అవకాశం ఉంటుంది’ అని హరిబాబు తెలిపారు.
లగ్జరీ, ఆల్ట్రా లగ్జరీ ఇండ్ల కోసం మొత్తం పది శాతం జనాభా నుంచి మాత్రమే డిమాండ్ ఉంది. మిగతా 60 శాతం మంది జనాభా ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలే. వారికి ఉచిత ఇండ్ల పథకాల ద్వారా సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చునని హరిబాబు అన్నారు.
What's Your Reaction?