HYDRA: తెలంగాణలో అక్రమ ఫాం హౌజ్‌లు కూలుతాయా?
హైడ్రా దూకుడుతో తెలంగాణ నేతల్లో ఆందోళన... తదుపరి చర్యలపై ఉత్కంఠ
ఇప్పుడు తెలంగాణలో నేతల ఫామ్‌హౌజ్‌ల గొడవ నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ను తీసుకురావడంతో పోలిటికల్ హీట్ పెరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ బంగారుబాతు గుడ్లే. ఎకరం వంద కోట్ల పై మాటే. ఈ నేత ఆ నేత అని కాదు.. అధికారంలో ఎవరుంటూ వారు బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ భూముల అన్ని చుట్టేశారు. నేతల కబ్జాలతో కొండలన్నీ కరిగిపోయాయి. చెరువులన్నీ వట్టి పోయాయి. అయితే రియల్ ఎస్టేట్ ప్లాట్ల దందా, లేకపోతే ఫామ్‌హౌజ్‌ల నిర్మాణాలు. అన్ని పార్టీల నేతల తీరు ఇదే. ఇప్పుడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటున్నారు. అది నాది కాదు.. నా దోస్తుదంటున్నారు. నాది సక్రమమే నీదే అక్రమమంటున్నారు. ఫస్టు నీ ఫామ్‌హౌజ్ కూల్చాలని ఒకరు, మొదలు నీదే కూల్చాలని ఇంకొకరు ఇలా మాటలతో టైం పాస్ చేస్తున్నారు. కౌంటర్లిచ్చుకుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. కేటీఆర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కేవీపీ, గడ్డం వివేక్, మధుయాష్కీ, పట్నం మహేందర్‌రెడ్డిల ఫామ్‌హౌజ్‌లన్నీ అక్రమంగా నిర్మించినవే అన్న ఆరోపణలు ఉన్నాయి.
అలాగే సీనిహీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది. గతంలోనూ ఈ అక్రమ కట్టడాలను కూల్చకుండా వదిలేశారు. శాటిలైట్ ద్వారా సర్వే చేసి చెరువుల భూముల్లో ఉన్న ఫామ్‌హౌజ్‌లన్నీ కూల్చాలని చెప్పిండు కేటీఆర్. మరి ఇన్నాళ్లూ వీళ్లే అధికారంలో ఉన్నారు కదా. అప్పడేం చేసిండ్రు అని జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాలు మారాయి. నేతలు పార్టీలు మారారు. కానీ ఇంత మంది ఫామ్‌హౌజ్‌లు కూల్చడం హైడ్రాతో సాధ్యమవుతుందా..? కేవలం ఇవన్నీ డ్రామాలేనా..? ఈ తంతూ కొన్నాళ్లకు వేడి చల్లారి చుప్పున ఆరిపోతుందా..? అదే జరగనుంది. పెద్ద తేడా ఏమీ ఉండదు. ఫామ్‌హౌజ్ లు కూలిపోవు. వాళ్లు వాళ్లు ఒక్కటే. ఆ ఫామ్ హౌజ్‌లన్నీ సేఫే.
హైదరాబాద్ సమీపంలోని అమీన్ పూర్, పటాన్ చెరు మండలాల్లో చెరువుల చుట్టూ వెలసిన కాలనీలు, ఎఫ్డీఎల్ పరిధిలోకి వచ్చే ప్లాట్లు, ఆక్రమణలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో అమీన్ పూర్ మండలం, మున్సిపాలిటీలోని ఒకటి రెండు చెరువులు, నాళాలు ఆక్రమణకు గురైనట్టు డ్రోన్ కెమెరాతో సర్వే చేసి గుర్తించింది. పైగా ఇటీవల రెండుసార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్ పూర్ లోని పలు చెరువులను సందర్శించి సమగ్ర నివేదికలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో గతంలో సర్వే నిర్వహించగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై న్యాయపరమైన చిక్కులు రాకుండా హైడ్రా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. దీంతో కొంతమంది ఆక్రమణదారులు ఆందోళనపడుతూ న్యాయనిపుణుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
What's Your Reaction?