HYDRAA: అక్రమ కట్టడాల కూల్చివేతకు కొత్త మెషీన్లు
దూకుడు పెంచుతున్న హైడ్రా... ఖర్చులన్నీ ఆక్రమణదారులై భరించాలని హైడ్రా స్పష్టీకరణ
హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలపై కొరఢా ఝులిపిస్తున్న హైడ్రా.. మరో1500 అక్రమ కట్టడాలపై చిట్టా రెడీ చేసింది. ఇప్పటివరకు చెరువులు, నాలాలు, పార్కుల కబ్జాలపై దాదాపు 1500 ఆక్రమణలు ఉన్నట్టు సమాచారం రాగా వీటిపై వేగంగా విచారణ జరుపుతోంది. ఎంక్వైరీ తర్వాత అవి ఆక్రమణలని తేలితే వెంటనే కూల్చివేయడానికి రెడీ అవుతోంది. కూల్చివేతలు నిదానంగా కొనసాగితే కొన్ని చోట్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన హైడ్రా అలా జరగకుండా ముందే ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగా అత్యాధునిక టెక్నాలజీతో స్పీడ్‌గా భవనాలను కూలుస్తుందనే పేరున్న మాలిక్ ట్రేడింగ్ అండ్ డిమాలేషన్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుతం హైడ్రా 25 మెషీన్లను ఉపయోగిస్తోంది. వీటితో 20 నుంచి 30 వరకు బిల్డింగులను ఈజీగా కూల్చేయవచ్చు. అయితే, కూల్చివేతలు ఫాస్ట్ గా కొనసాగుతున్నప్పటికీ ఈ యంత్రాలను ఒకచోట నుంచి మరోచోటకు తరలించేందుకు గంటల సమయం పడుతోంది. డిమాలిష్చేయడానికి ముందే ఎలా కూల్చాలో ఇంజినీర్లు డిజైన్ చేస్తారు. ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు వారంలో రెండు రోజులు మాత్రమే సాగాయి. హైడ్రా దగ్గర పెద్ద లిస్టే ఉన్న నేపథ్యంలో వచ్చే రోజుల్లో కూల్చివేతల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో మరిన్ని మెషీన్లు తెచ్చుకోవాలని సదరు సంస్థకు హైడ్రా సూచించినట్టు సమాచారం. ప్రస్తుతమున్న 25కి అవసరమైతే మరో 25 కూడా తెచ్చేందుకు కాంట్రాక్ట్ సంస్థ రెడీ అయినట్టు తెలిసింది.
ఖర్చులు వారి దగ్గర నుంచే...
హైదరాబాద్‌లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా సరికొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్తోంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని నిర్మాణదారుల నుంచే వసూలు చేయాలనుకుంటోంది. నిర్మాణ వ్యర్థాల తరలింపులో సవాలు.. హైడ్రా అధికారులు ఇప్పటికే 18 చోట్ల 166 నిర్మాణాలను నేలమట్టం చేశారు. కట్టడాలు కూల్చడంతో నిర్మాణ వ్యర్థాలు భారీగా పోగుపడుతున్నాయి. వీటిని తరలించడానికి రూ.కోట్లలోనే ఖర్చయ్యే అవకాశం ఉంది. కూల్చిన చెరువుల దగ్గర ఫెన్సింగ్ వేస్తేనే తిరిగి ఆక్రమణలు జరగవని స్థానికులు చెబుతున్నారు. కుంచించుకుపోయిన వాటిని పునరిద్ధరించాలంటే తవ్వకాలు జరిపి పూర్వ ఆకారాన్ని తీసుకురావాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా దగ్గర ఆ స్థాయిలో నిధుల్లేవు. ప్రస్తుతం కూల్చిన 166 నిర్మాణ వ్యర్థాలను తొలగించడానికి ఏర్పాట్లు చేసినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కూల్చివేతకు ఇచ్చిన కాంట్రాక్టులో శిథిలాల తొలగింపు ఒక భాగంగా చేశామని తెలిపారు. ఆర్‌ఆర్ చట్టం కింద ఈ మొత్తం వ్యయాన్ని నిర్మాణదారుల దగ్గరే వసూలు చేసేలే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
What's Your Reaction?