India: వచ్చే నెల నుంచి జనగణన?

2021లో ప్రారంభం కావాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా

Aug 23, 2024 - 11:18
 0  2
India: వచ్చే నెల నుంచి జనగణన?

మన దేశంలో జనాభా లెక్కల కార్యక్రమం సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ కార్యక్రమం 2021లో జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సెప్టెంబర్ నెల నుంచి జనగణన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సెప్టెంబరు నుంచి దేశంలో జనగణన జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారని రాయిటర్స్‌ న్యూస్‌ ఏజెన్సీ ఒక కథనంలో పేర్కొన్నది. దేశంలో ప్రతి పదేండ్లకు ఒకసారి జనగణన జరుగుతున్నది. ఈ లెక్కన 2021లో జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్‌ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత మహమ్మారి ప్రభావం తగ్గినప్పటికీ జనగణనపై కేంద్రం దృష్టి సారించలేదు. దీంతో ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. జనగణన జరగకపోవడం వల్ల ఆర్థిక డాటా, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన సమాచార నాణ్యతపై ప్రభావం పడుతున్నదని పలువురు ఆర్థికవేత్తలు కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ లెక్కలన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తూ రావడం వల్ల దేశంలో అసలైన పరిస్థితులు ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో ఎట్టకేలకు వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు సమాచారం.

జనగణన పూర్తి కావడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హోంశాఖ ఈ ప్రక్రియకు నేతృత్వం వహించనున్నది. 2026 మార్చిలో ప్రభుత్వ గణాంకాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ప్రధానమంత్రి కార్యాలయం తుది అనుమతులు రాగానే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టు ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్‌ పేర్కొన్నది. కాగా, ఇప్పటికే జనాభాలో చైనాను భారత్‌ దాటిపోయి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారిందని గత ఏడాది ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొన్నది. జనగణనతో ఈ విషయం అధికారికంగా వెల్లడి కానున్నది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News