KTR: కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాల్సిందే
అప్పటి వరకూ కాంగ్రెస్ సర్కార్ వెంట పడతాం... చేవెళ్ల ఆందోళనలు కేటీఆర్ హెచ్చరిక
తెలంగాణలో ఎలాంటి కొర్రీలు, ఆంక్షలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన ఆందోళనలో కేటీఆర్ పాల్గొన్నారు. రూ.2లక్షల వరకు రుణమాఫీకి రూ.49వేల కోట్లు అవుతాయని సీఎంకు బ్యాంకర్లు చెప్పారని... మంత్రివర్గంలో దీనికి రూ.31వేల కోట్లు అని పేర్కొంటూ తీర్మానం చేశారని కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు రుణమాఫీకి రూ.26వేల కోట్లు కేటాయించారని.. వందశాతం రైతుల రుణాలు మాఫీ చేసినట్లు సీఎం చెబుతున్నారని అన్నారు. ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లెలో వందశాతం జరిగినట్లు నిరూపించాలని సవాల్ విసిరితే సమాధానం లేదన్నారు. ఆరు గ్యారంటీలు, ప్రజలకు ఇచ్చిన ఇతర వాగ్దానాల అమలుపై సమాధానం చెప్పే సత్తా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేదని కేటీఆర్ అన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో లేని సాంకేతిక సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో ఊరుకుంటే రైతుభరోసా అప్పుడు కూడా మోసం చేస్తారని కేటీఆర్ హెచ్చరించారు. రైతులు కాంగ్రెస్ నేతల వెంటపడి నిలదీయాలని... ఇది తొలి అడుగు మాత్రమే అని. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టబోమని కేటీఆర్ అన్నారు.
సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవని... ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా రేవంత్ మాట మార్చాడని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇక ప్రజలు తనను నమ్మరని భావించి…ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్ట్ 15 కు రుణమాఫీ చేస్తా అని చెప్పాడని కేటీఆర్ గుర్తు చేశారు. దేవుళ్లను కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పతనం ప్రారంభం
రైతులను రోడ్లపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ముందు తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిచాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు నేడు గుర్తిస్తున్నారని చెప్పారు. రుణమాఫీతో రైతుల ఆశలు ఆవిరి అయ్యాయని అన్నారు. తప్పుడు లెక్కలతో రుణమాఫీ చేయకుండా మాయ చేస్తున్నారని ఆరోపించారు. రైతులు తీసుకున్న రుణాలు, చేసిన మాఫీకి, ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఎలాంటి పొంతన లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ను నమ్మినంత వరకు రాష్ట్రంలో రైతులకు ఏ కష్టం రాలేదు. కాంగ్రెస్ మాటలతో ప్రజలు నిండా మునిగారన్నారు. రైతులే రుణమాఫీ మాట మారుస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారు మెడలు వంచుతారన్నారు. రైతుల ఉద్యమానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
What's Your Reaction?