Maharashtra: మహారాష్ట్రలో కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం
గత ఏడాది విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
రెండు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింధు దుర్గ్ జిల్లాలోని రాజ్ కోట్ కోట వద్ద ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలింది.దీన్ని గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ప్రస్తుతం విగ్రహం కూలిపోవడానికి అసలు కారణం ఏమిటనేది నిర్ధారణ కాలేదు. అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. ప్రతిపక్షాలు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విమర్శించాయి. పనుల నాణ్యతపై తక్కువ శ్రద్ధ చూపిందని ఆరోపించాయి.
పీటీఐ ప్రకారం… 35 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మధ్యాహ్నం 1 గంటలకు మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో పడిపోయిందని ఓ అధికారి తెలిపారు. దీనికి గల కారణాన్ని నిపుణులు కనుగొంటున్నారు. అయితే గత రెండు మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి. ఇది కూడా ఓ కారణం కావచ్చని అధికారుల అభిప్రాయం. పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి నష్టంపై దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ ఘటనపై ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. పనుల నాణ్యతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కమీషన్ల కోసం ప్రభుత్వం కొత్త టెండర్లను మాత్రమే జారీ చేస్తుంది.” అని ఆరోపించారు. శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే వైభవ్ నాయక్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిలో నాణ్యత లేనిదని విమర్శించారు. “రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు. విగ్రహం నిర్మాణం, ప్రతిష్టాపనకు బాధ్యులైన వారిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి” అని ఆయన అన్నారు.
What's Your Reaction?