Mamata Banerjee | మమతకు పాలీగ్రాఫ్ టెస్ట్ చేయాలి.. వైద్యురాలిపై హత్యాచారం కేసులో బీజేపీ ఫైర్
Mamata Banerjee | బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అక్కడి ప్రతిపక్ష బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన వారికి మమత రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించింది. కేసులో నిజాలు బయటకు రావాలంటే ఆమెకు పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది.
Mamata Banerjee : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అక్కడి ప్రతిపక్ష బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన వారికి మమత రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించింది. కేసులో నిజాలు బయటకు రావాలంటే ఆమెకు పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. మంగళవారం నిరసనలు చేపట్టిన విద్యార్థులను అడ్డుకోవడానికి ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మోహరించడాన్ని బీజేపీ ఖండించింది.
విద్యార్థుల పట్ల మమత నియంతలా వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో న్యాయమైన విచారణ జరగాలంటే ఆమె వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని, వైద్యురాలిపై హత్యాచారం జరిగితే దానిని పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం తెలుసుకోవడానికి పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్‌కు కూడా లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ.. విద్యార్థులపై పోలీసులు చేస్తున్న దాడులను ఆపాలని, లేదంటే రాష్ట్రం మొత్తం స్తంభించిపోయేలా చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్’ నిరసన చేపట్టింది. ‘నబన్నా అభియాన్’ పేరుతో హావ్‌డా నుంచి విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు.
ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో హావ్‌డాలోని సంతర్‌గాచి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
What's Your Reaction?