Osmania Hospital | గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆస్ప‌త్రి.. 32 ఎకరాల్లో భవనాల నిర్మాణానికి నిర్ణయం

Osmania Hospital | హైదరాబాద్​లోని గోషామహల్‌లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని చెప్పారు.

Aug 27, 2024 - 20:58
 0  5
Osmania Hospital | గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆస్ప‌త్రి.. 32 ఎకరాల్లో భవనాల నిర్మాణానికి నిర్ణయం
Revanth Health

Osmania Hospital | హైద‌రాబాద్ : హైదరాబాద్​లోని గోషామహల్‌లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని చెప్పారు. గోషామహ‌ల్‌లోని పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు దాదాపు 32 ఎకరాల స్థలముంది. ప్రస్తుతం పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఉన్న ఈ స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్కడే ఉస్మానియా ఆస్ప‌త్రి నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను ముఖ్యమంత్రి చర్చించారు.

రాబోయే 50 ఏళ్ల అవసరాలను అంచనా వేసుకొని, కొత్త ఆస్ప‌త్రి నిర్మాణ డిజైన్లు ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని, ఆస్ప‌త్రి చుట్టూరా నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు. ఆస్ప‌త్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించాలని ఆదేశించారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు. కేవలం కాంక్రీట్ భవంతులు, బహుళ అంతస్తులు కాకుండా ఆహ్లాదకరమైన విశాలమైన ఖాళీ ప్రాంగణం ఎక్కువగా ఉండేలా డిజైన్లు ఉండాలని సూచించారు. ఉస్మానియా ఆస్ప‌త్రి నిర్మాణానికి సంబంధించి అనుభవజ్ఙులైన ఆర్కిటెక్ట్స్ లతో డిజైన్‌ల‌ను తయారు చేయించాలని అన్నారు.

ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడుతామని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ రివర్ డెవల‌ప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేట్లబుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ, చుట్టూ ఉన్న స్థలాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఇప్పుడు గోషామహల్‌లో ఉన్న పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అక్కడికి తరలించేలా చూడాలని చెప్పారు.

రాష్ట్రంలో కొత్తగా నిర్మించే ఆస్ప‌త్రుల పనులను వేగవంతం చేయాలని, 15 నర్సింగ్ కాలేజీ భవనాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు వీలుగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది నుంచే నర్సింగ్ కాలేజీలను ప్రారంభించాలని, తాత్కాలికంగా అద్దె భవనాల్లో వీటిని నిర్వహించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News