PARA OLYMPICS: క్రీడా సంబురం.. పారాలంపిక్స్
11 రోజులపాటు సంబరంగా క్రీడలు.. భారత్ నుంచి బరిలో 84 మంది మృతి
సమ్మర్ ఒలంపిక్స్ ముగిసి పక్షం రోజులైనా కాక ముందే మరో క్రీడా సంబురానికి వేదికైంది పారిస్. అబ్బుర పరిచే ప్రదర్శనలు.. అద్భుత విన్యాసాలు.. విజేతల పతక సంబరాలు... ఆశ్చర్యపరిచే రికార్డులు.. వీటన్నిటి సమాహారంతో పారిస్ ఒలింపిక్స్ అభిమానులను అలరించింది. అదే విధంగా నేటి నుంచి పారాలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. అభిమానుల్లో స్ఫూర్తిని నింపడానికి.. ఆటలతో అలరించడానికి పారిస్ పారాలింపిక్స్ సిద్ధమైంది. దివ్యాంగుల కోసం జరగబోయే ఈ క్రీడల్లో 168 దేశాల నుంచి 4400 మంది అథ్లెట్లు పోటీల్లో పాల్గొనబోతున్నారు.
కాంకార్డ్ స్టేడియంలో ప్రారంభం..
11 రోజుల పాటు పారిస్ సందడిగా మారనుంది. డిలా కాంకార్డ్ వేదికలో బుధవారం పారాలింపిక్స్ మొదలవ్వనున్నాయి. పారాలింపిక్స్ చరిత్రలో స్టేడియంలో కాకుండా బహిరంగ ప్రదేశంలో తొలిసారి ప్రారంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో వివిధ క్రీడలకు వేదికలుగా నిలిచిన ప్రదేశాల్లోనే పారాలింపిక్స్‌లోనూ పోటీలు జరగనున్నాయి. అయితే ఐఫిల్ టవర్ సమీపంలో బీచ్ వాలీబాల్ నిర్వహించిన ప్రాంతంలో అంధుల సాకర్ నిర్వహించబోతున్నారు. పారిస్‌లో మొదటిసారి గోల్‌బాల్, బోచా ఆటలు ఆసక్తిని రేపుతున్నాయి. చైనా (282) అత్యధికంగా అథ్లెట్లను పోటీలకు పంపుతోంది.
ఇండియా నుంచి బరిలో 84 మంది
పారిస్ పారాలింపిక్స్‌లో ఇండియా నుంచి 84 మంది అథ్లెట్లు బరిలో నిలవనున్నారు. అథ్లెటిక్స్ (38), బ్యాడ్మింటన్ (13), షూటింగ్ (10), ఆర్చరీ (6), పవర్‌లిఫ్టింగ్ (4), పారా కనోయింగ్ (3), సైక్లింగ్, జూడో, టేబుల్ టెన్నిస్, రోయింగ్ (2), తైక్వాండో, స్విమ్మింగ్ (1) మన అథ్లెట్లు పోటీపడుతున్నారు. వీరిలో జీవాంజి దీప్తి (400 మీటర్ల టీ20 పరుగు, వరంగల్), కొంగనపల్లి నారాయణ (రోయింగ్, నంద్యాల), షేక్ అర్షద్ (నంద్యాల, తైక్వాండో), రొంగలి రవి (అనకాపల్లి, షాట్‌పుట్) తెలుగు రాష్ట్రాల నుంచి పారిస్‌కు వెళ్లారు.. ముఖ్యంగా టోక్యో క్రీడల్లో స్వర్ణం నెగ్గిన కృష్ణ నగార్, సుమిత్ అంటిల్, మనీశ్ నర్వాల్ ఈసారి ఆ పతకాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. కాలితో విల్లు పట్టుకుని బాణాలు సంధించే శీతల్ దేవి తొలి పారాలింపిక్స్‌లో తన ముద్ర వేయాలనే సంకల్పంతో ఉంది. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 5 బంగారు సహా 19 పతకాలు సాధించింది. ఈసారి 25 పతకాలు అయినా తేవాలని నిశ్చయించుకుంది. భాగ్యశ్రీ జాదవ్, సుమిత్ అంటిల్ ఇండియా తరపున పతాకధారులుగా వ్యవహరించనున్నారు.
వీరిపైనే దృష్టి..
పారాలింపిక్స్‌లో 7 స్వర్ణాలతో సహా 17 పతకాలు గెలిచిన అమెరికా స్టార్ ఒక్సానా మాస్టర్స్ (సైక్లింగ్) ఈసారి ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వాలెంటీనా పెట్రిలో (ఇటలీ, అథ్లెటిక్స్) ఈ క్రీడల్లో బరిలో దిగబోతున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలవనుంది. అలాగే 50 మీటర్లు, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన 16 ఏళ్ల చెక్ అమ్మాయి డేవిడ్ క్రటోచ్‌విల్, షార్క్ దాడిలో కాలు పోగొట్టుకున్న అమెరికా తార అలీ ట్రువిట్ పై కూడా అభిమానుల దృష్టి ఉంది.
What's Your Reaction?