PAWAN: నేడు అన్నమయ్య జిల్లాలో పవన్ పర్యటన
మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం... భారీ భద్రత ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొననున్న ఆయన.. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుసగా తనకు కేటాయించిన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్న పవన్... నేడు అన్నమయ్య జిల్లాకు రాబోతున్నారు.. ఉదయం 8 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో బయల్దేరనున్న పవన్.. 9 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి నుంచి రోడ్డు మార్గంలో అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలోని మైసూరాపల్లికి వెళ్తారు. ఉదయం 10 గంటల రైల్వే కోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం.. 11.30 గంటల వరకు మైసూరావారిపల్లె నుంచి రాజంపేట మండలం పులపత్తూరు గ్రామానికి వెళ్తారు. తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలిస్తారు.
గ్రామసభలకు తరలిరావాలి
పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతంపై ఎన్డీయే కూటమి హామీ ఇచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఒకేరోజు 13,326 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మలిదశ సంస్కరణలు మొదలుపెట్టామన్నారు. పంచాయతీల్లో ఆగస్టు 15, జనవరి 26న ఉత్సవాల నిర్వహణకు నిధులు పెంచినట్లు వివరించారు. గ్రామసభల్లో యువత, మహిళలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా అమలు చేస్తామన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేలా చర్యలు తీసుకున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.
అచ్యుతాపురం ప్రమాదం బాధాకరం
అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని అన్నారు. ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖ కిందికి వస్తుందని చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పామన్నారు. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమని చెప్పారు. సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు.
What's Your Reaction?