PM Modi : భారత్‌, పోలండ్ మధ్య కుదిరిన సామాజిక భద్రతా ఒప్పందం

భారత్ ఏం చేసినా కొత్త రికార్డే..

Aug 23, 2024 - 11:17
 0  2
PM Modi : భారత్‌, పోలండ్ మధ్య  కుదిరిన సామాజిక భద్రతా ఒప్పందం

భారత్‌, పోలండ్ మధ్య సామాజిక భద్రతా ఒప్పందం కుదిరినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  గురువారం ప్రకటించారు. నూతన సాంకేతికతలు, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోందని తెలిపారు. మోదీ బుధవారం పోలండ్‌కు చేరుకున్నారు. తొలుత అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పోలాండ్‌లోని భారతీయ సమాజ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత్ ఏం చేసినా రికార్డుగా మారి చరిత్ర అవుతుందన్నారు. దీనితో పాటు భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడం గురించి కూడా మాట్లాడారు. ఈ సమయంలో ప్రజలు ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా వింటూ కనిపించారు.భారత ప్రధానుల్లో ఎవరూ గత 45 ఏళ్లలో పోలండ్‌కు వెళ్లలేదు. చివరిసారిగా 1979లో నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ పోలండ్‌ను సందర్శించారు.

ఈ ఏడాది తొలిసారిగా పోలండ్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌నకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో భారత్‌, పోలండ్‌ మధ్య అనుబంధానికి ఈ ఆట మూలంగా ఉద్భవించిందని మోదీ గుర్తుచేశారు. భారత్‌ నుంచే కబడ్డీ పోలండ్‌కు చేరుకుందని తెలిపారు. దాన్ని ఆ దేశం మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలండ్‌ కబడ్డీ జట్టుకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆ దేశ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌, అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో భేటీ కానున్నట్లు వెల్లడించారు. ఉభయ దేశాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయన్నారు. అందులో ప్రజాస్వామ్య విలువలు ఒకటని తెలిపారు. భారత్‌లో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను గుర్తుచేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారత్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆర్థికంగా గత పదేళ్లలో భారత్‌ సాధించిన విజయాలను వివరించారు. అలాగే రాబోయే రోజుల్లో సాధించాల్సిన అనేక అంశాలను ప్రవాసభారతీయుల ముందు ప్రస్తావించారు. డిజిటల్‌ ఇండియా, సమ్మిళిత ఆర్థిక వృద్ధిలో సాధించిన పురోగతిని వివరించారు.

బుధవారం పోలండ్‌ రాజధాని వార్సాకు చేరుకున్న మోదీ శుక్రవారం అక్కడినుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు రైల్లో వెళ్తారు. 1991లో సోవియెట్‌ యూనియన్‌ నుంచి విడిపోయి పూర్తిస్థాయి దేశంగా ఉక్రెయిన్‌ ఆవిర్భవించాక భారత ప్రధాని అక్కడకు వెళ్లడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌కు స్నేహితుడిగా, భాగస్వామిగా ఆ ప్రాంతంలో సత్వరం శాంతి, సుస్థిరతలు నెలకొనాలని భారత్‌ ఆకాంక్షిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ ఘర్షణకు శాంతియుత పరిష్కారం లభించడానికి ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీతో వివిధ దృక్కోణాలను పంచుకోనున్నట్లు వెల్లడించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News