Rains | రాష్ట్రంలో ఆరు రోజుల పాటు వర్షాలు..! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..!!
Rains | తెలంగాణలో గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పట్లో వర్షాలు తెలంగాణను వీడేలా కనిపించటం లేదు. రాష్ట్రంలో మరో ఆరు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Rains | హైదరాబాద్ : తెలంగాణలో గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పట్లో వర్షాలు తెలంగాణను వీడేలా కనిపించటం లేదు. రాష్ట్రంలో మరో ఆరు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు.
మంగళవారం నుంచి బుధవారం వరకు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, ఆదిలాబాద్, కొమరంభీం-ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోభారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. బుధవారం నుంచి గురువారం వరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి-కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు.
భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకూడదని సూచించారు.
ఇక హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు చెప్పారు. ఉదయం ఎండగా అనిపించినా.. మధ్యాహ్నాం తర్వాత వాతావరణం చల్లబడుతుందని చెప్పారు. సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గత వారం క్రితం హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్కూళ్లకు కూడా సెలవులు మంజూరు చేశారు. మరోసారి భారీ వర్షం హెచ్చరిక నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
What's Your Reaction?