Revanth Reddy | 15 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వీసీల నియమాకం : సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy | ద్రౌపది స్వయంవరం సమయంలో అర్జునుడి లక్ష్యం చేప కన్నుపై కేంద్రీకృతమైనట్లే సివిల్స్‌లో ఎంపిక కావడమనే ఏకైక లక్ష్యమే మీకు ఉండాలని తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబ, ఆర్థిక, ఇతర సమస్యలను పట్టించుకోవద్దని సూచించారు
Revanth Reddy | ద్రౌపది స్వయంవరం సమయంలో అర్జునుడి లక్ష్యం చేప కన్నుపై కేంద్రీకృతమైనట్లే సివిల్స్‌లో ఎంపిక కావడమనే ఏకైక లక్ష్యమే మీకు ఉండాలని తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబ, ఆర్థిక, ఇతర సమస్యలను పట్టించుకోవద్దని సూచించారు. తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన 135 మందికి రాజీవ్ సివిల్స్ అభయ హస్తం కింద రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం సచివాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం సివిల్స్ ప్రిలిమ్స్ పూర్తి చేసిన వారంతా మెయిన్స్‌కు, ఆ తర్వాత ఇంటర్వ్యూకు అర్హత సాధించాలని, అంతిమంగా సివిల్స్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధిలో ముందున్నా సివిల్స్ సాధనలో మనకంటే ఎంతో వెనుకబడిన బిహార్, రాజస్థాన్‌లతో పోల్చితే వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి రూ.లక్ష సాయం అందించామని, మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తే మరో రూ.లక్ష అందిస్తామని వెల్లడించారు. సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు, మెయిన్స్, ఇంటర్య్వూ.. ఎంపిక వరకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తనకు, మంత్రులకు తెలియజేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో సివిల్స్‌లో ఎంపికై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
పది, పదిహేను రోజుల్లోనే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు, ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
మన విద్య సర్టిఫికెట్లకే పరిమితమవుతోందని, వేలాది మంది ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసినా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు వారిలో ఉండడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న వారు లభించక సంస్థలు కూడా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి, నిరుద్యోగ సమస్య నిర్మూలనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించి దానికి పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, శ్రీనివాసరాజులను ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లుగా నియమించామని తెలిపారు. మార్కెట్ అవసరాలకు తగినట్లుగా నిపుణులను తయారు చేసేందుకు వీలుగా ఆ యూనివర్సిటీలో సిలబస్, శిక్షణ, నిర్వహణకు నిధుల సమీకరణ అంతా ఛైర్మన్, వైస్ ఛైర్మన్, బోర్డు సభ్యులే చూసుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీలో అన్ని సర్టిఫికెట్, డిప్లమో కోర్సులు ఉంటాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం వృథా కాకుండా 2 వేల మందికి శిక్షణ ప్రారంభిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి యూనివర్సిటీ శిక్షణ ఇస్తుందని చెప్పారు.
What's Your Reaction?