Suicides report: ఆందోళనకు గురి చేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు
దేశంలో సాధారణ బలవన్మరణాలకు రెట్టింపు నమోదు
భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు పెరుగుతున్నాయి ఇందుకు సంబంధించి ఒక కొత్త నివేదిక వెల్లడి చేసింది. నివేదిక ప్రకారం.. భారతదేశంలోని విద్యార్థుల ఆత్మహత్యల రేటు జనాభా పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. ఇదే కాకుండా, ఈ రేటు మొత్తం ఆత్మహత్య రేటును కూడా మించిపోయిందని పేర్కొంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ఆధారంగా.. వార్షిక IC3 కాన్ఫరెన్స్, ఎక్స్‌పో 2024లో బుధవారం “స్టూడెంట్ సూసైడ్: ఎపిడెమిక్ ఇన్ ఇండియా” నివేదికను విడుదల చేశారు.
మొత్తం ఆత్మహత్యల సంఖ్య ఏటా 2 శాతం పెరిగితే.. విద్యార్థుల ఆత్మహత్యల కేసులు 4 శాతం పెరిగాయని నివేదిక వెల్లడించింది. విద్యార్థుల ఆత్మహత్యల కేసులను “అండర్ రిపోర్టింగ్” చేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. IC3 ఇన్స్టిట్యూట్ సంకలనం చేసిన నివేదిక ప్రకారం.. “గత రెండు దశాబ్దాలలో, విద్యార్థుల ఆత్మహత్యల రేటు జాతీయ సగటు కంటే రెండింతలు.. 4 శాతం ప్రమాదకర వార్షిక రేటుతో పెరిగింది. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యలలో మగ విద్యార్థుల సంఖ్య 6 శాతం తగ్గగా, మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు 7 శాతం పెరిగాయి.” అని తెలిపింది. గత దశాబ్దంలో 0-24 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 582 మిలియన్ల నుండి 581 మిలియన్లకు తగ్గిందని.. విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుండి 13,044కి పెరిగిందని నివేదిక పేర్కొంది.
ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు
మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలోని మొత్తం ఆత్మహత్యల్లో ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య మూడో వంతు ఉన్నారు. ఈ కేసుల్లో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమిష్టిగా 29 శాతం నమోదు కాగా, రాజస్థాన్ 10వ స్థానంలో ఉంది.
విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో పురుషుల ఆత్మహత్యలు 50 శాతం, స్త్రీల ఆత్మహత్యలు 61 శాతం పెరిగాయి. గత ఐదేళ్లలో రెండు లింగాల సగటు వార్షిక వృద్ధి 5 శాతం ఉంది.
What's Your Reaction?