Supreme Court:సుప్రీంకోర్టు విజ్ఞప్తికి స్పందించి సమ్మె విరమించిన వైద్యులు

దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇచ్చిన సీబీఐ

Aug 23, 2024 - 11:15
 0  0
Supreme Court:సుప్రీంకోర్టు విజ్ఞప్తికి స్పందించి సమ్మె విరమించిన వైద్యులు

దేశ సర్వోన్నత న్యాయస్థానం హామీ మేరకు  సమ్మె విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ నినదిస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌, ఆర్‌ఎంఎల్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు ఆందోళనలు చేపట్టారు. మొత్తానికి కోర్టు సూచన మేరకు సమ్మె విరమించారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఆందోళనల కారణంగా పేదలు నష్టపోకూడదని వ్యాఖ్యానించింది. వెంటనే విధుల్లో చేరాలని.. ఆందోళనలు చేపట్టిన వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వైద్యులు సమ్మె విరమించారు.

ఇదిలా ఉంటే వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కోల్‌కతా హైకోర్టు ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టారు. అయితే రంగంలోకి దిగకముందే క్రైమ్ సీన్ ఆనవాళ్లు చెరిపేసినట్లుగా గుర్తించారు. దీంతో దర్యాప్తు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి అండ్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ సహా ఈ కేసుతో సంబంధమున్న మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్‌ టెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. సీబీఐ చేసిన విజ్ఞప్తిని కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్‌ టెస్టుకు అనుమతి లభించింది.

సీబీఐ విచారణలో సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం. ఇక ఘటన తర్వాత.. సందీప్ ఘోషే.. బాధిత కుటుంబానికి తప్పుడు సమాచారం ఇప్పించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఒక ప్రణాళిక ప్రకారం క్రైమ్ ఆఫ్ సీన్‌ కూడా మార్చేసినట్లుగా సీబీఐ అభిప్రాయపడుతుంది. సందీప్ ఘోష్‌తో సహా మరో నలుగురు వైద్యులు ఆయనతోనే ఉన్నట్లుగా సీబీఐ భావించింది. మరింత సమాచారం రాబట్టడం కోసం పాలిగ్రాఫ్‌ టెస్టుకు రెడీ అయింది. దీంతో కీలక సమాచారాన్ని సీబీఐ రాబట్టనుంది.

ఇక వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం నిరసన చేస్తున్న డాక్టర్లకు సూచించింది. మరోవైపు ఆర్జీ కర్ ఆస్పత్రి దగ్గర కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. గురువారం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై మండిపడింది. తీవ్రంగా ధ్వజమెత్తింది. అంతేకాకుండా బాధితురాలు దహన సంస్కారాలు పూర్తయ్యాక కేసు నమోదు చేయడంపై కూడా పోలీస్ యంత్రాంగంపై మండిపడింది. ఇదిలా ఉంటే న్యాయం కోసం దేశ వ్యాప్తంగా మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News