T Congress : తెలంగాణ పీసీసీపై ఉత్కంఠ

ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం..

Aug 23, 2024 - 11:15
 0  1
T Congress  : తెలంగాణ పీసీసీపై ఉత్కంఠ

టీపీసీసీకి కొత్త చీఫ్ ను నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో నేడు ఏఐసీసీ నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ ముగ్గురి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. అలాగే కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయి అధ్యక్షుడి నేతృత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని, లేకపోతే కేడర్ కు దిశానిర్దేశం చేయడంలో ఇబ్బందులు వస్తాయని అధిష్టానం భావిస్తున్నది.

సమాలోచనలతో ముందుకు

కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎవరిని నియమించాలనే అంశంపై పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ల అభిప్రాయాలు తీసుకుంటున్నది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు వస్తాయేమోననే ఉద్దేశ్యంతో సంప్రదింపులు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

రేసులో ఆ నలుగురు

పీసీసీ అధ్యక్షుడి కోసం చాలా మంది రేసులో ఉన్నా, ఫైనల్ లిస్టులో బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎస్సీ వర్గం నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, ఎస్టీ వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఇందులో ఎవరిని నియమిస్తే పార్టీకి ఉపయోగం ఉంటుంది? అనే కోణంలో పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తోంది.

ప్రతిపక్షాన్ని ఎవరు సమర్థవంతంగా ఎదుర్కోగలరు? అనే విషయాలపై పార్టీ చర్చలు చేస్తోంది. అలాగే పీసీసీ పదవి ఒక సామాజిక వర్గానికి ఇస్తే, త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఆ వర్గానికి మంత్రి పదవి ఉండదని హైకమాండ్ స్పష్టం చేసినట్టు తెలిసింది.

సీఎం రేవంత్కు పనిభారం తగ్గించాలే..

లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూలు వచ్చేలోపు పీసీసీ చీఫ్ పై పైనల్ చేయాలని ఏఐసీసీ భావిస్తున్నది. లేకపోతే అటు ప్రభుత్వం, ఇటు పార్టీ కార్యక్రమాల కోసం రేవంత్ పూర్తి స్థాయి సమయం కేటాయించడం కష్టంగా ఉంటుందని, అందుకే కొత్త అధ్యక్షుడి పర్యవేక్షణ, స్ట్రాటజీతోనే ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ సైతం భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కేబినెట్ విస్తరణపై మల్లగుల్లాలు?

పీసీసీ అధ్యక్షుడి ఎంపికతోపాటు కేబినెట్ విస్తరణపై కూడా హైకమాండ్ వద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎంతో కలుపుకుని మొత్తం 12 మంది మంత్రులు ఉండగా, మరో ఆరుగురికి కేబినెట్ లో చోటు ఉంది. అయితే ప్రస్తుతం సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు లేదా నలుగురిని కేబినెట్ లోకి తీసుకునే చాన్స్ ఉందని కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఓ లీడర్ వివరించారు. ఒకవేళ విస్తరణ జరిగితే ఇద్దరు రెడ్లు, ఒక ఎస్సీ, ఒక మైనార్టీకు చాన్స్ ఉంటుందని, లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల తర్వాతనే ముహుర్తం ఉండొచ్చని సదరు లీడర్ కామెంట్ చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News