TG: తెలంగాణలో మళ్లీ ప్రజాపాలన
సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభం... రేషన్‌కార్డులు, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు, ఆరోగ్యకార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఏళ్లుగా వీటి కోసం ఎదురు చూసిన వారి ఇబ్బందులు ఇక తొలగున్నాయని సీఎం స్పష్టత ఇచ్చారు. ఇందుకోసం వచ్చే నెలలో ప్రత్యేకంగా ప్రజాపాలన నిర్వహించనున్నారు. సెప్టెంబరు 17 నుంచి పది రోజులపాటు అవసరమైన వివరాలను సేకరించనున్నారు. రాష్ట్రంలో ఇకపై రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. రాజీవ్‌ఆరోగ్యశ్రీ వైద్యసేవలకు, సీఎంఆర్‌ఎఫ్ నుంచి సాయం అందించేందుకు ఈ హెల్త్‌కార్డులే ప్రామాణికంగా ఉంటాయన్నారు. డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి ఎలాంటి పద్ధతి అనుసరించాలనే విధి విధానాలపై చర్చించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసేందుకు ఏయే వైద్య పరీక్షలు చేయాలి, గ్రామాల్లో ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలా? అనే అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి ఫ్రాన్స్‌లో అనుసరిస్తున్నా విధానాలను అనుసరించాలని, ఈ విధానాన్ని సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
వైరల్ జ్వరాలపై సీఎం ఆందోళన
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. రాష్ట్రంలో డెంగీ, గన్యా సహా వైరల్ జ్వరాలతో ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో సాగాలి. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సేవా సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి. పలు గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. డెంగీ, చికున్ గన్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలి. అవసరమైన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి’’ అని సీఎం అధికారులకు ఆదేశించారు.
స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలి
రాష్ట్రంలో డెంగీ కట్టడికి స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు.ఈ మేరకు ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. అన్ని రకాల మందులను సిద్ధంగా ఉంచాలి. సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి అని మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే వంటి చర్యలను ముమ్మరం చేయాలి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.
What's Your Reaction?