గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే... గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమం కట్
గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే... గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమం కట్
*గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమం కట్* *గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే* *నిర్మూలనకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపాలి* *నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేష్* *ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై ఈగల్ గా మార్పు* *పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈగల్ కమిటీలు ఏర్పాటు* అమరావతిః రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పూర్తిస్థాయి నియంత్రణకు యుద్ధం చేయాలని, ఇకపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం మూడో సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ భేటీకి హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఈగల్ గా(ELITE ANTI-NARCOTICS GROUP FOR LAW ENFORECEMENT-EAGLE) మారుస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. సభ్యులు పలు ప్రతిపాదనలు చేశారు. గంజాయి సాగు కట్టడికి టెక్నాలజీ వినియోగించుకోవాలి ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పలు ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు కట్టడికి పంట సాగును గుర్తించేలా అధునాతన టెక్నాలజీ వినియోగించాలని అన్నారు. గంజాయి సాగు ధ్వంసానికి డ్రోన్లను వినియోగించాలని ఆదేశాలు జారీ చేసారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈగల్ కమిటీలు ఏర్పాటు గంజాయి, డ్రగ్స్ నియంత్రణతో పాటు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటుచేయాలి. కమ్యూనిటీ పోలిసింగ్ కూడా జరగాలి. మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను కుడా భాగస్వామ్యం చేయాలి. డ్రగ్స్ దుష్పరిణామాలపై పాఠ్యాంశం రూపొందించి విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంది. గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వారి ఫోటోలను ప్రత్యేక వెబ్ సైట్ లో, పోలీస్ స్టేషన్ లో పొందుపర్చాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమం కట్ గంజాయి, డ్రగ్స్ వలన యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మాదకద్రవ్యాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదని సబ్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసే ఆలోచనను మంత్రుల ఉపసంఘం సమావేశంలో చర్చించింది. దీని వలన గంజాయి, డ్రగ్స్ ను అరికట్టే అవకాశం మెరుగుపడుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని అమలు చెయ్యడానికి సాధ్యాసాధ్యాలు, ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానాలు కూడా అధ్యయనం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. గంజాయి దుష్పరిణామాలను పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశా పాదయాత్ర సమయంలో గంజాయి బాధిత కుటుంబాల వేదనను ప్రత్యక్షంగా చూశా. అనేక కుటుంబాలు నన్ను కలిశాయి. గంజాయికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని మహిళలంతా కోరారు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. కాబట్టి వీటి నియంత్రణకు పోలీసులు ఫీల్డ్ లోకి అగ్రెసివ్ గా వెళ్లాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పంజాబ్ లో డ్రగ్స్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అధ్యయనం చేయాలని, ఇన్ ఫ్లూయెన్సర్స్ తో అవగాహన కల్పించాలన్నారు. ఈగల్ టీమ్ కు న్యాయపరమైన శిక్షణ కోసం సెమినార్ నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మెగా ర్యాలీ నిర్వహణపైనా సమావేశంలో చర్చించారు. ఇప్పటికే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972ను సీఎం చేతులమీదుగా వర్చువల్ గా ప్రారంభించారు. ఈగల్ లోగోను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు చేపట్టబోయే కార్యక్రమాలను పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ప్రత్యామ్నాయ పంటలకు గిరిజన సంక్షేమ శాఖ సహకారం గంజాయి పండించకుండా అవగాహన కల్పించడం తో పాటు వారికి ప్రత్యామ్నాయం కూడా కల్పిస్తున్నాం అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ సమావేశంలో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆమె సమావేశంలో వివరించారు ఈ సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారి లోకేష్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈగల్ ఆకే రవికృష్ణ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?