Trai-OTP | మొబైల్ ఫోన్ల యూజర్లకు ట్రాయ్ తంట.. ఓటీపీ మెసేజ్‌లు ఆలస్యం..
Trai-OTP | స్పామ్ సందేశాలు, స్పామ్ కంటెంట్ కు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ తెచ్చిన నిబంధనలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
Trai-OTP | ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండటంతో సైబర్ మోసగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించి రూ.లక్షలు.. రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు. స్పామ్ మెసేజ్ లు, స్పామ్ కాల్స్.. ప్రత్యేకించి ఫిషింగ్ ప్రయత్నాలతో అమాయకులను ప్రలోభ పెట్టి వారి డబ్బు స్వాహా చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నూతన నిబంధనలు తీసుకొస్తోంది. వైట్ లిస్ట్ చేయని కాల్ బ్యాక్ నంబర్లు, యూఆర్ఎల్స్, ఓటీటీ లింక్స్, ఏపీకే ఫైల్స్ (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీలు) సంబంధించిన మెసేజ్ లను నిలిపేయాలని రిజిస్టర్డ్ టెలికం ప్రొవైడర్లను ట్రాయ్ ఆదేశించింది.
ఈ నిబంధనలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం ఈ నెల 31 లోపు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ తమ మెసేజ్ ల టెంప్లేట్లు, కంటెంట్‌ను సంబంధిత టెలికం ఆపరేటర్ల వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ట్రాయ్ ఆదేశించింది. ఈ నిబంధనను బ్యాంకులు, ఈ-కామర్స్ సంస్థలు గడువు లోపు అమలు చేయకుంటే వాటి మెసేజ్ లు బ్లాక్ చేయాలని ట్రాయ్ స్పష్టం చేసింది.
ఈ నిబంధనలు అమల్లోకి రావడం వల్ల మొబైల్ ఫోన్ యూజర్లు తమ ప్రీ పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ బిల్లుల చెల్లింపు మొదలు ఈ-కామర్స్ బిల్లుల చెల్లింపులు సమస్యాత్మకంగా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీల కస్టమర్లు నిర్వహించే లావాదేవీలు, సర్వీస్ సందేశాల్లో అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నిబంధన అమలుకు మరి కొంత సమయం పడుతుందని టెలికం ఆపరేటర్లు చెబుతున్నారు. సంబంధిత మెసేజ్‌లు టెలికం ఆపరేటర్ల వద్ద చెక్ చేసుకోవాలని, ఆ తర్వాతే యూజర్లకు పంపాలని ట్రాయ్ పేర్కొంది.
ప్రతి రోజూ మొబైల్ ఫోన్లకు 150 నుంచి 170 కోట్ల వాణిజ్య సందేశాలు వెళుతున్నాయి. నెల వారీగా 5500 కోట్ల మెసేజ్ లు వెళుతున్నాయని ఇండస్ట్రీ సమాచారం. ఈ నిబంధనలను అమలు చేయడానికి తమ బ్లాక్ చైన్ బేస్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ)ని అప్ డేట్ చేసుకోవాల్సి ఉందని టెలికం ఆపరేటర్లు చెబుతున్నారు. టెలికం ప్రొవైడర్లకు సరిపడా సమయం ఇచ్చామని, గడువు పొడిగించే ప్రసక్తే లేదని ట్రాయ్ అధికార వర్గాలు తెలిపాయి.
What's Your Reaction?