Tripura: కొండచరియలు విరిగిపడి త్రిపురలో 22 మంది మృతి
17 లక్షల మందిపై ప్రభావం
త్రిపురలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలతో వరద ముంచెత్తి కొండ చరియలు విరిగిపడి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గల్లంతయ్యారు. సహాయక శిబిరాల్లో 32,750 మంది ఆశ్రయం పొందుతున్నారు.
త్రిపురను ఆకస్మికంగా ముంచెత్తిన వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలకు తోడు వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సోమవారం నుంచి 22 మంది మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. పంట పొలాలు దెబ్బతినగా, పలు ఇండ్లు నీటమునిగాయి. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
లక్షలాది మంది నీటమునిగిన ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. భారీ వరదల కారణంగా 17 లక్షల మంది ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు ప్రభుత్వం గురువారం తెలిపింది. అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ ప్రదేశాల్లో చిక్కుకుపోయిన వారిని కేంద్రం పంపిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తీవ్రంగా ప్రభావితమైన అమర్‌పూర్‌కు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఆహార పదార్ధాలు, ఇతర సామగ్రిని తరలించారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా దెబ్బతిన్న గోమతి, పశ్చిమ త్రిపుర, సెపహిజల జిల్లాలలో సహాయ కార్యక్రమాలు చేపట్టాయి.
What's Your Reaction?