Trump: మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తున్నాం: ట్రంప్
ఓవైపు బాంబుల వర్షం కురుస్తుంటే బైడెన్ సైలెంట్ గా ఉన్నాడంటూ ఫైర్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతున్నాయని హెచ్చరించారు. కానీ, అది తగదని హితవు పలికారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అమెరికా ఏం చేస్తోందని అధ్యక్షుడు జో బైడెన్ పాలక వర్గాన్ని ట్రంప్ ప్రశ్నించారు. తాజా ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బైడెన్ కాలిఫోర్నియా బీచ్‌లో సేద తీరుతున్నారని.. కమలా హారిస్ ఎన్నికల ప్రచారం పేరిట దేశవ్యాప్తంగా బస్సుయాత్ర చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి కమలా హారిస్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఆమె నేతృత్వంలో అసలు దేశానికి భవిష్యత్తే ఉండదని వ్యాఖ్యానించారు. ప్రపంచాన్ని ఆమె అణు యుద్ధం దిశగా తీసుకెళ్తారని ఆరోపించారు. ఆమెను ప్రపంచం ఎప్పటికీ గౌరవించబోదంటూ ధ్వజమెత్తారు. ఇటీవల తన నామినేషన్‌ను స్వీకరిస్తూ.. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని కమలా హారిస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్‌పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా.. ప్రతిగా హెజ్‌బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్‌తోపాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ స్పందించారు.
కాగా, మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ ట్రంప్ హెచ్చరించడం ఇది 32 వ సారి. 2013 నుంచి పలు సందర్భాలలో దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. అయితే, తాజాగా డెమోక్రాట్ల తరఫున కమలా హారిస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో పోటీపడుతుండడంతో ఆమెపై విమర్శల జోరు పెంచారు. కమల నాయకత్వంలో అమెరికాకు భవిష్యత్తు అనేదే ఉండదని తాజాగా ఆరోపించారు. తామందరినీ ఆమె అణుయుద్దం వైపు తీసుకెళుతుందని హెచ్చరించారు.
What's Your Reaction?