Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు గోల్డ్ మెడల్! ఇచ్చింది ఎవరంటే..
వినేశ్ ను విభిన్నంగా సత్కరించిన గ్రామ పెద్దలు
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు అద్భుత గౌరవం దక్కింది. స్వగ్రామంలోని పెద్దలు ఆమెను విభిన్నంగా సత్కరించారు. నేడు వినేశ్ ఫొగాట్ పుట్టినరోజు సందర్భంగా బలాలి గ్రామ పెద్దలు (సర్వ్ ఖాప్) ఆమెను విభిన్నంగా సత్కరించారు. వినేశ్‌ను గోల్డ్ మెడల్‌తో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వినేశ్ పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ సహా మరికొందరు పాల్గొన్నారు. వినేశ్‌ను బంగారు పతక విజేతగానే భావిస్తామని ఇప్పటికే సర్వ్ ఖాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పిన విధంగానే నేడు వినేశ్‌ను గోల్డ్ మెడల్‌తో సత్కరించారు. నేటితో ఆమె 30వ పడిలోకి అడుగుపెట్టారు.
ఈ సత్కార కార్యక్రమంలో వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ… ‘నా పోరాటం ఇంకా ముగియలేదు. భారత అమ్మాయిల కోసం ఇప్పుడే నా పోరాటం మొదలైంది. పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్‌లో ఆడలేకపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నేను ఎంతో దురదృష్టవంతురాలిని అని భావించా. కానీ స్వదేశంలో నాకు దక్కిన మద్దతు చూశాక అదృష్టరాలిని అని అనిపించింది. ఇలాంటి మద్దతు ఇతర మహిళా క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తుందని అనుకుంటున్నా. నాకు ఇచ్చిన ఈ మెడల్ కంటే మరేదీ గొప్ప గౌరవం కాదు’ అని చెప్పారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేశ్ ఫొగాట్ అనర్హత వేటును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు ముందు కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో అనర్హతకు గురైంది. దీనిపై కాస్‌కు వినేశ్ అప్పీల్ చేయగా.. తీర్పును మూడుసార్లు వాయిదా వేసింది. చివరకు నిరాశ తప్పలేదు. తీవ్ర మనో వేదనతో పారిస్ నుంచి భారత్‌కు చేరుకున్న వినేశ్‌కుఘన స్వాగతం లభించింది. ఆమె స్వగ్రామం బలాలిలోనూ గ్రాండ్ వెల్‌కమ్ దక్కింది.
What's Your Reaction?