West Bengal : శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దు: సుప్రీం
వెంటనే విధుల్లో చేరాలని వైద్యులకు సూచన
ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోల్‌కతా హత్యాచార ఘటనను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.ఈ ఘటనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆందోళన చేస్తున్న వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని సూచించింది. విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను సూచించింది. ఇక, నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేలా శుక్రవారం లోగా ఆదేశాలివ్వాలని కోల్‌కతా కోర్టుకు తెలిపింది.
వైద్యుల భద్రత కోసం ఏర్పాటుచేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌కు సూచనలు చేసేందుకు ఓ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటుచేయాలని వైద్యారోగ్య సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యల కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, పోలీసు అధికారులతో చర్చలు జరపాలని పేర్కొంది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 5వ తేదీకి వాయిదా వేసింది.
న్యాయం, వైద్యం ఆపద్దు..
న్యాయం, వైద్యం ఆగిపోవడానికి వీలు లేదని, వైద్యులు వెంటనే విధుల్లోకి చేరాలని కోర్టు సూచించింది. విధుల్లోకి చేరిన వైద్యులు, సిబ్బందిపై నిరసనల్లో పాల్గొన్నందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది.
సంజయ్‌ది లైంగికంగా వికృతమైన మనస్తత్వం:
ఆర్‌జీ కర్ దవాఖానలో ట్రైనీ డాక్టర్ (31) హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ (33) పశు ప్రవృత్తి కలవాడని, అశ్లీలతకు బానిస అని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వర్గాలు తెలిపాయి. నిందితుడు సంజయ్‌ది లైంగికంగా వికృతమైన మనస్తత్వం, జంతువులను పోలిన ప్రవృత్తిని కలిగి ఉన్నాడని తేలింది. సంజయ్ మానసిక స్థితిని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్య బృందం విశ్లేషించినపుడు ఈ విషయం తెలిసింది. నిందితుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని, జరిగిన ప్రతి విషయాన్నీ గుక్కతిప్పుకోకుండా వివరించాడని సీబీఐ వర్గాలు తెలిపాయి. నేరం జరిగిన ప్రదేశంలో సంజయ్ ఉన్నట్లు తెలిపే సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని చెప్పాయి.
What's Your Reaction?