అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి..
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన యువకుడు ఎమ్మెస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ప్రాాణాలు కోల్పోయాడు.
ఉన్నత చదువుల నిమిత్తమో, ఉద్యోగాల నిమిత్తమో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువైంది. అమెరికాలో తమ పిల్లలు చదువుకుంటున్నారనో, ఉద్యోగాలు చేస్తున్నారనో చెప్పుకోవడం ఆనందంగా భావిస్తుంటారు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు.. కానీ ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిస్తే గుండెల్లో గుబులు కలుగుతుంది. తమ వారి గురించి ఆందోళన చెందుతుంటారు.. నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు ఇక్కడ ఒంటరిగా నివసిస్తున్నవారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పెదిని రూపక్ రెడ్డి (౨౬) ౮ నెలల క్రితం అమెరికా వెళ్లాడు.డెలవేర్ లో ఉంటున్న రూపక్ హరిస్ బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్ చదువుతున్నాడు. మంగళవారం సాయింత్రం అతడు తన స్నేహితులతో కలిసి జార్జ్ లేక్ కు వెళ్లారు. అక్కడ బోట్ షికార్ చేస్తూ లేక్ మధ్యలో ఉన్న రాయిపైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు ఫోటోలు దిగుదామని. కానీ పట్టుతప్పి నీళ్లలో పడిపోయాడు.
స్నేహితులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.. రెస్క్యూ బృందం కూడా అతడిని ప్రాణాలతో కాపాడలేకపోయింది. అప్పటికే రూపక్ ప్రాణాలు కోల్పోయాడు. తమ స్నేహితుడు తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో వారి ముఖాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషణ్ణ వదనాలతో సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. రూపక్ బాడీని స్వగ్రామం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
What's Your Reaction?